ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపాలు...26 మంది మృతి

January 18, 2022
img

ఇప్పటికే తీవ్ర ఆర్ధిక సంక్షోభం, ఆహారపు కొరతతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలకు మరొక పెద్ద కష్టం వచ్చిపడింది. సోమవారం వరుసగా రెండుసార్లు తీవ్ర స్థాయిలో భూకంపాలు రావడంతో అనేక ఇళ్ళు కూలిపోయి శిధిలాల క్రింద చిక్కుకొని 26 మంది చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.  

ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దు ప్రాంతమైన  పశ్చిమ ప్రావిన్స్ బాద్గిస్‌లో సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు మళ్ళీ సాయంత్రం 4 గంటలకు రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై మొదటి భూకంపం తీవ్రత 5.3, రెండో భూకంపం తీవ్రత 4.9గాను నమోదు అయ్యింది. ఈ భూకంపాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో చాలా ఇళ్ళు కేవలం బంకమట్టి, ఇటుకలతో కట్టిన ఇళ్ళు కావడంతో రెండు గంటల వ్యవధిలో వరుసగా రెండుసార్లు వచ్చిన భూకంపాలతో అనేక ఇళ్ళు నేలకూలాయి. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే...ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకొన్నప్పటి నుంచి దేశంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవడంతో శిధిలాల తొలగింపు తగిన సిబ్బంది లేకుండాపోయారు. దీంతో బాధితులే శిధిలాల క్రింద చిక్కుకొన్న తమవారిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో శిధిలాల తొలగింపు మెల్లగా సాగుతూ వాటి క్రింద చిక్కుకొన్నవారు బతికి బయటపడే అవకాశాలు తగ్గుతున్నాయి. తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజల పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతుంటే చివరికి భగవంతుడు కూడా వారిని కనికరించడం లేదు.

Related Post