మూడు లక్షలు కట్టలేక 20 ఏళ్ళు జైల్లో...తుదిశ్వాస!

November 01, 2021
img

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన దరూరి బుచ్చన్న అనే ఓ దళిత కార్మికుడు మూడు లక్షలు కట్టలేక 20 ఏళ్ళపాటు షార్జా  జైలులో మగ్గి చివరికి క్షయ వ్యాధితో ఇటీవల జైల్లోనే చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం... బుచ్చన్న సుమారు 22 ఏళ్ళ క్రితం షార్జాలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేందుకు వెళ్ళాడు. ఆ సమయంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన తోటి కార్మికుడితో కలిసి ఓ గదిలో ఉండేవాడు. ఓ రోజు వారిరువురికీ ఏదో విషయమై ఘర్షణ జరుగగా బుచ్చన్న క్షణికావేశంలో అతనిని కత్తితో పొడవడంతో అతను చనిపోయాడు. దీంతో షార్జా పోలీసులు బుచ్చన్నను అరెస్ట్ చేసారు. 

ఇస్లామిక్ చట్టాల ప్రకారం మృతుడి కుటుంబం నష్టపరిహారం తీసుకొని క్షమించినట్లయితే హంతకుడికి క్షమాభిక్ష లభిస్తుంది. బుచ్చన్న కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ వెళ్ళి మృతుడి కుటుంబ సభ్యులను క్షమాభిక్ష కోసం బ్రతిమాలుకోగా వారు రూ.3 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తేచాలని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు బుచ్చన్నకు క్షమాభిక్ష పెట్టేందుకు అంగీకరించడంతో బుచ్చన్న మరణశిక్ష పడకుండా బ్రతికిపోయాడు. కానీ నిరుపేదలైన బుచ్చన్న కుటుంబం వద్ద అంత డబ్బు లేకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, తెలిసినవారందరి చుట్టూ డబ్బు కోసం తిరిగింది. కానీ మూడు లక్షలు పోగేయలేకపోవడంతో బుచ్చన్న గత 20 ఏళ్ళుగా షార్జా జైలులోనే మగ్గాడు. కొన్నేళ్ళ క్రితం అతనికి పక్షవాతం సోకింది. ఆ తరువాత క్షయ వ్యాధి సోకడంతో ఇటీవల జైల్లోనే ఆరోగ్యం క్షీణించి అత్యంత దయనీయ పరిస్థితులలో చనిపోయాడు. 

Related Post