తాలిబన్లకు పాకిస్థాన్‌ షాక్!

October 15, 2021
img

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వానికి మొదటి నుంచి అండగా నిలబడుతున్న పాకిస్థాన్‌, తొలిసారిగా వారికి షాక్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల వశమైన తరువాత ప్రపంచదేశాలన్నీ తమ విమానయాన సేవలను నిలిపివేశాయి. ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాబూల్ నుంచి ఒక విమానం నడిపిస్తోంది. అదొక్కటే ఆఫ్ఘనిస్తాన్‌ దేశాన్ని ప్రపంచదేశాలతో కలిపే  ఏకైక ప్రయాణ సాధనం. ఇప్పుడు అదీ నిలిచిపోయింది. 

కాబూల్-ఆఫ్ఘనిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌-కాబూల్ విమాన ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని కనుక తక్షణం వాటిని తగ్గించకపోతే విమానాలను నిలిపివేస్తామని తాలిబన్లు పాక్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిపై మండిపడిన పాక్‌ ప్రభుత్వమే గురువారం నుంచి కాబూల్‌కు తమ విమానాలను నిలిపివేసింది. ఊహించని పాక్ చర్యతో తాలిబన్ ప్రభుత్వం షాక్ అయ్యింది. 

ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ పక్క ఉగ్రవాద తాలిబన్ల ప్రభుత్వం నడుస్తుండగా, మరోపక్క తరచూ ఐసిస్ ఉగ్రవాదులు బాంబు ప్రేలుళ్ళకు పాల్పడుతున్నారు. కనుక పాక్‌ భీమా సంస్థలు ఆఫ్ఘనిస్తాన్‌ను అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతంగా  గుర్తించి భీమా ప్రీమియంను భారీగా పెంచేశాయి. దాంతో గతంలో కాబూల్-ఇస్లామాబాద్ టికెట్ ఛార్జీ 120 డాలర్లు ఉండగా ఇప్పుడు 2,500 డాలర్లు ఉంది. 

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం చేపట్టాక తమ దేశానికి విమానసేవలను పునరుద్దరించాలని కోరుతూ భారత్‌,  పాక్‌లతో సహా అన్ని దేశాలకు లేఖలు వ్రాశారు. కానీ వాటిని ఏ దేశమూ పట్టించుకోలేదు. ఇప్పుడు పాక్‌ కూడా విమానాలను నిలిపివేయడంతో ఆఫ్ఘనిస్తాన్‌కు మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 

Related Post