న్యూజిలాండ్ వెనక్కుపోవడానికి కారణం భారత్‌: పాక్‌

September 23, 2021
img

సుమారు 18 ఏళ్ళ తరువాత పాకిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టీములు సిద్దపడ్డాయి. కానీ చివరి నిమిషంలో భద్రత కారణాల చేత రెండు జట్లు సిరీస్ రద్దు చేసుకొంటున్నట్లు ప్రకటించడంతో పాక్‌ క్రికెటర్లు, అభిమానులు, ప్రభుత్వం అందరూ షాక్ అయ్యారు. మొదట..దీనికి కారణం అమెరికాయే అని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిందించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మిలటరీ ఆపరేషన్స్ కోసం పాక్‌ భూభాగం వినియోగించుకొనేందుకు తాము అనుమతించకపోవడంతో అమెరికా కక్షగట్టి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్టులపై ఒత్తిడి తెచ్చి మ్యాచ్ రద్దు చేయించిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 

అయితే ఇప్పుడు భారత్‌ కుట్రల కారణంగానే ఆ రెండు జట్లు వెనక్కు వెళ్లిపోయాయని పాక్‌ సమాచార శాఖ మంత్రి ఫవాడ్ చౌదరి ఆరోపిస్తుండటం విశేషం. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గఫ్తిల్‌ భార్యకు సింగపూర్ ఐపీ అడ్రస్ కలిగిన కంప్యూటర్ నుంచి ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చిందని, నిజానికి అది భారత్‌ నుంచే వచ్చిందని చౌదరి ఆరోపించారు. విదేశీ జట్లు పాకిస్థాన్‌లో ఆడకుండా భారత్‌ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. భారత్‌ కుట్రల వలన పాకిస్థాన్‌ ప్రతిష్టకు భంగం కలుగుతోందని, పాక్‌లో జరిగే మ్యాచ్‌ల స్పాన్సర్లు తీవ్రంగా నష్టపోయారని ఫవాడ్ చౌదరి ఆరోపించారు. 

అయితే పాక్‌ ఉగ్రవాదమే ఆ దేశానికి శాపంగా మారిందనే సంగతి పాక్‌ పాలకులతో సహా యావత్ ప్రపంచానికి తెలుసు. పాక్‌లో ఉగ్రవాద విష సర్పాలను పెంచి పోషిస్తూ వాటికి ఈవిదంగా మూల్యం చెల్లిస్తూ భారత్‌, అమెరికాలను నిందిస్తుండటం ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది కదా?

Related Post