అమెరికాలో మళ్ళీ తుపాకుల మోత...11 మంది మృతి

September 06, 2021
img

అమెరికాలో మళ్ళీ తుపాకులు పేలాయి. ఈసారి మూడు వేర్వేరు ప్రాంతాలలో 11 మంది చనిపోయారు. శనివారం రాత్రి వాషింగ్‌టన్‌లోని లాంగ్ ఫెలో స్ట్రీట్‌లో గల బ్రైట్‌వుడ్ పార్క్‌ వద్ద ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి కారులో పరారి అయ్యాడు. పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు. 

ఇటువంటివే మరో రెండు ఘటనలు ఆదివారం జరిగాయి. ఫ్లోరిడాలోని లేక్ లాండ్ వద్ద నిన్న తెల్లవారుజామున ఓ వ్యక్తి జరిపిన కాల్పులలో ఓ బాలింత, ఆమె శిశువు, 11 ఏళ్ళ బాలిక, ఒక మహిళ చనిపోయారు. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఎదురుకాల్పులు జరిపి ఆ వ్యక్తిని బందించారు. 

హ్యూస్టన్ నగరంలో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో కుటుంబ సభ్యుల మద్య మొదలైన గొడవ కాల్పులు, చావులతో  ముగిసింది. ఈ ఘటనలో 50-55 ఏళ్ళు వయసున్న ఇద్దరు పెద్దవాళ్ళు, 10-13 సం.లు వయసున్న ఇద్దరు పిల్లలు చనిపోయారు. కాల్పులు జరిగిన తరువాత ఇంట్లో మంటలు వ్యాపించి ఇల్లు తగులబడింది. దాంతో అగ్నిమాపకశాఖ వచ్చి మంటలు ఇరుగుపొరుగు ఇళ్ళకు వ్యాపించకుండా నివారించారు. 

అమెరికాలో తుపాకుల వ్యాపారానికి వేలకోట్ల టర్నోవర్ ఉంటుంది. అందుకే ఈ గన్ కల్చర్‌ను నిషేదించడానికి ఏ ప్రభుత్వం ప్రయత్నించినా వారి బలమైన లాబీ అడ్డుపడుతుంటుంది. తుపాకి చేతిలో ఉంటే అది ఏదో ఓనాడు పేలకుండా ఉండదు కనుక ఏటా అమెరికాలో అనేకమంది వాటికి బలవుతూనే ఉన్నారు.

Related Post