మా నిర్ణయం సరైనదే: జో బైడెన్‌

September 02, 2021
img

ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి హడావుడిగా అమెరికా సేనలను ఉపసంహరించుకోవడంతో ఆ దేశం పెద్ద సంక్షోభంలో చిక్కుకొంది. తాలిబన్ల నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడుతామని చెప్పిన అమెరికా చివరికి తాలిబన్లకే అప్పగించేసి తోక ముడిచి పారిపోయిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా తమను మోసం చేసిందని ఆఫ్ఘన్‌ ప్రజలు ఆరోపిస్తున్నారు. జో బైడెన్‌ తీసుకొన్న ఈ నిర్ణయం అమెరికా ప్రతిష్టకు భంగం కలిగించిందని అమెరికన్లు వాదిస్తున్నారు. ఈవిదంగా ఇంటా, బయటా కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జో బైడెన్‌, తన నిర్ణయాన్ని గట్టిగా సమర్దించుకొన్నారు. 

వాషింగ్‌టన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇది చాలా సరైన, తెలివైన, అత్యుత్తమమైన నిర్ణయం. నా ముందు అమెరికాను పాలించినవారు తీసుకొన్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ఇప్పటికే మనం చాలా నష్టపోయాము. మన సైనికులు ఆఫ్ఘనిస్తాన్‌ దేశాన్ని కాపాడేందుకు తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే, తమ దేశాన్ని కాపాడుకోవలసిన ఆఫ్ఘన్‌ సైన్యం తాలిబన్లతో పోరాడకుండానే లొంగిపోయింది....ఆ దేశాధ్యక్షుడు దేశం విడిచి పారిపోయారు. ప్రజల కళ్ళ ముందే ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఈ పరిస్థితులలో ఇంకా మన సైనికులను అక్కడ ఉంచడం ఏమాత్రం శ్రేయస్కరం కాదనే వెనక్కు తీసుకు వచ్చేశాము. ఆఫ్ఘనిస్తాన్‌ విడిచివెళ్ళిపోవాలనుకొంటున్న విదేశీయులను అడ్డుకోబోమని తాలిబన్లు మాట ఇచ్చారు. కానీ మేము వారి మాటలను గుడ్డిగా నమ్మకుండా వారి చర్యలను కూడా నిశితంగా గమనిస్తూ చురుకుగా నిర్ణయం తీసుకొని మన సైనికులతో సహా చాలామందిని అక్కడి నుంచి తరలించాము. 

అమెరికా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకొన్నాము. 2001లో జరిగిన దాడులను కాదు... 2021లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నాము. ఇప్పుడు మనం సోమాలియా, సిరియా, ఇరాక్, ఆఫ్రికా, ఆసియా దేశాలలో వివిద ఉగ్రసంస్థలను ఎదుర్కోవలసివస్తోంది. ఈ పరిస్థితులలో ఇంకా ఆఫ్ఘనిస్తాన్‌లో మన సైనికులను కొనసాగించడం ఈ మాత్రం సరికాదు,” అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు.

Related Post