ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు కొత్త సమస్య

August 30, 2021
img

ఒక్క తూటా పేల్చకుండా ఆఫ్ఘనిస్తాన్‌ దేశాన్ని వశపరుచుకొన్న తాలిబన్లకు ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదుల నుంచి కొత్త సవాళ్ళు ఎదుర్కోవలసివస్తోంది. గత గురువారం కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ ఉగ్రవాదులు రెండు భారీ ఆత్మహుతి దాడులు జరిపారు. దానిలో 13 మంది అమెరికన్ సైనికులు, తాలిబన్లతో సహా 100 మందికి పైగా చనిపోగా మరో 145 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ దాడులు జరిగిన తరువాత మళ్ళీ దాడులు జరుగవచ్చని అమెరికా ముందే హెచ్చరించింది. అలాగే నిన్న, ఈరోజు కాబూల్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈరోజు ఉదయం నగరంలోని ఓ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న వాహనంలో నుంచి కాబూల్ విమానాశ్రయంపైకి వరుసగా 5 రాకెట్లు దూసుకువచ్చాయి. అయితే అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థ వాటిని వెంటనే గుర్తించి గాలిలోనే పేల్చివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఆ పరిసర ప్రాంతాలన్నీ పెద్దశబ్ధాలతో మారుమోగిపోయాయి. ఆకాశంలో నుంచి రాకెట్ శఖలాలు నగరంలో పలుచోట్ల పడ్డాయి. 

నిన్న ఉదయం ఐసిస్ ఉగ్రవాదులు ఓ వాహనంలో విమానాశ్రయంవైపు దూసుకువస్తున్నట్లు గుర్తించిన అమెరికా రక్షణ వ్యవస్థ వారిపై డ్రోన్‌ దాడి చేసి మట్టుపెట్టింది. కానీ అదే సమయంలో పరిసర ప్రాంతాలలో ఉన్న కొంతమంది గాయపడ్డారు. ఒక పసిపిల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. 

మంగళవారం అర్ధరాత్రి 12 గంటలలోగా కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా సేనలు స్వదేశానికి వెళ్లిపోతే ఐసిస్ ఉగ్రవాదులు మరింత రెచ్చిపోవచ్చు. ఐసిస్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతామని తాలిబన్లు చెపుతున్నప్పటికీ అది అంత సులువు కాదు. ఇప్పటికే ఆఫ్ఘన్‌ ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒకవేళ తాలిబన్లకు, ఐసిస్ ఉగ్రవాదులకు మద్య యుద్ధం మొదలైతే పరిస్థితులు మరింత దుర్భరంగా మారుతాయి. 

Related Post