కాబూల్ విమానాశ్రయం వద్ద మేమే దాడి చేశాం: ఐఎస్ఐఎస్

August 27, 2021
img

కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నిన్న జరిగిన బాంబు దాడిలో 12 మంది అమెరికా సైనికులతో పాటు మొత్తం 72 మంది చనిపోయారు. మరో 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆత్మహుతి దాడులకు మేమే పాల్పడ్డామని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ప్రకటించారు. ఆత్మహుతి దాడిలో పాల్గొన్న ఇద్దరు తీవ్రవాదుల ఫోటోను కూడా ఐఎస్ఐఎస్ విడుదల చేసింది. రెండు నిమిషాల వ్యవధిలో వరుసగా రెండు ప్రేలుళ్ళు జరిగాయి. ఆ సమయంలో విమానాశ్రయం వద్ద వందలాది మంది ఆఫ్ఘనిస్తాన్‌ పౌరులు నిలిచి ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.  

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా స్పందించారు. “ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అమెరికన్ సైనికులను, అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న వారిని ఎన్నటికీ క్షమించబోము. వారిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకొంటాము. ఆఫ్ఘనిస్తాన్‌ను వశపరుచుకొన్న తాలిబన్లకు అనుబంధంగా పనిచేస్తున్న ఐఎస్ఐఎస్-కె అనే సంస్థ ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం ఉంది. కనుక వారిని వేటాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా పెంటాగన్‌ను ఆదేశించాను. తగిన సమయం, సందర్భంలో వారిపై దాడి చేసి మట్టుబెడతాము. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా పౌరుల తరలింపు కొనసాగుతుంది,” అని జో బైడెన్‌ అన్నారు.

Related Post