కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ ప్రేలుళ్ళు

August 26, 2021
img

తాలిబన్ల పునఃప్రవేశంతో సంక్షోభంలో చిక్కుకొన్న ఆఫ్ఘనిస్తాన్‌లో అప్పుడే బాంబు ప్రేలుళ్ళు కూడా మొదలైపోయాయి. ఈరోజు మధ్యాహ్నం కాబూల్ విమానాశ్రయంలో అబ్బే గేట్ వద్ద భారీ ప్రేలుడు, తుపాకి కాల్పులు జరిగినట్లు అమెరికా, బ్రిటన్‌ దేశాలు దృవీకరించాయి. అయితే ఈ ప్రేలుళ్ళు ఎవరు జరిపారు?ఎంతమంది చనిపోయారు గాయపడ్డారనే వివరాలు ఇంకా తెలియవలసి ఉందని అమెరికా, బ్రిటన్ అధికారులు చెప్పారు. కాబూల్ విమానాశ్రయం వద్ద ఇటువంటి దాడులు జరగవచ్చని అమెరికా నిఘా వర్గాలు ఈరోజు ఉదయమే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. కొన్ని గంటల వ్యవధిలోనే ప్రేలుళ్ళు జరిగాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అక్కడ గస్తీ కాస్తున్న బ్రిటన్ దళాలు ఆ గేటును మూసివేశాయి. లేకుంటే ఈ ప్రేలుళ్ళకు పాల్పడిన వ్యక్తులు విమానాశ్రయంలోనికి జొరబడి విమానాల వద్ద ప్రేలుళ్ళు జరిపి ఉండేవారేమో? ప్రేలుళ్ళ నేపధ్యంలో అమెరికా, బ్రిటన్ సైనికులు అక్కడ ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ పౌరులను విమానాశ్రయానికి దూరంగా వెళ్లిపోవాలని మైకులు పదేపదే హెచ్చరికలు చేశారు. 

ఈ నెల 31వ తేదీలోగా ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా, బ్రిటన్ దళాలు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని తాలిబన్లు మూడు రోజుల క్రితమే హెచ్చరించారు. ఆ గడువు దగ్గర పడుతుండటంతో బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలకు తొలి హెచ్చరికగా ఈ ప్రేలుళ్ళు జరిపి ఉండవచ్చనే వాదనలు వినపడుతున్నాయి. 

        


Related Post