అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం

August 25, 2021
img

ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికన్ దళాల ఉపసంహరణ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ముందుగా ప్రకటించినట్లే ఈనెల 31వ తేదీలోగా ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా దళాలను పూర్తిగా ఉపసంహరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయంలో మాత్రమే 5,800 మంది అమెరికన్ సైనికులున్నారు. వారిని కూడా ఆగస్ట్ 31నాటికల్లా వెనక్కు తీసుకురావాలని జో బైడెన్‌ నిర్ణయించారు. 

ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంకా వేలమంది విదేశీయులు చిక్కుకుపోయి ఉన్నందున మరికొంతకాలం పాటు అమెరికన్ సైనికులను కాబూల్ విమానాశ్రయంలో ఉంచాలని బ్రిటన్ తదితర మిత్రదేశాలు ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ జో బైడెన్‌ అంగీకరించలేదు. ఒకవేళ ఆగస్ట్ 31 తరువాత కాబూల్లో అమెరికన్ సేనలను నిలిపి ఉంచితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని తాలిబన్లు హెచ్చరించిన నేపధ్యంలో అధ్యక్షుడు జో బైడెన్‌ అమెరికా జాతీయ భద్రతాసలహాదారు జేక్ సలివాన్ బృందంతో సుదీర్ఘంగా చర్చించిన తరువాత వారి సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. కనుక మిగిలిన ఈ ఆరు రోజులలో వీలైనంత ఎక్కువ మందిని కాబూల్ నుంచి బయటకు తరలించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.    

కాబూల్ విమానాశ్రయం నుంచి కూడా అమెరికన్ సైనికులు వెళ్లిపోతే ఇక ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకొన్న విదేశీయులకు, తాలిబన్లకు భయపడి విదేశాలకు వెళ్లిపోదామని ఆశగా విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తున్న వేలాదిమంది ఆఫ్ఘన్‌ పౌరులకు అన్ని ద్వారాలు మూసుకుపోయినట్లే. ఆ తరువాత తాలిబన్ల దయాదాక్షిణ్యాలపై జీవించక తప్పదు.

Related Post