తాలిబన్ల తొలి ఫత్వా జారీ...కో-ఎడ్యుకేషన్ బంద్‌!

August 21, 2021
img

ఆఫ్ఘనిస్తాన్‌లో ఇకపై ప్రజాస్వామ్యం ఉండదని అంతా షరియత్ చట్టాల ప్రకారమే నడుచుకోవలసి ఉంటుందని తాలిబన్లు స్పష్టంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తాలిబన్లు శుక్రవారం తొలి ఫత్వా జారీ చేశారు. దాని ప్రకారం ఇక నుంచి దేశంలో కో-ఎడ్యుకేషన్ నిషేధం విధించబడింది. ఇకపై ఆడపిల్లలకు మహిళా ఉపాద్యాయులు, మగపిల్లలకు పురుష ఉపాధ్యాయులలే పాఠాలు చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కో-ఎడ్యుకేషన్ వీలులేదని, సకల పాపాలు, అనర్ధాలకు అదే కారణమని వారు తేల్చి చెప్పారు. కనుక ఇకపై ఆడపిల్లలకు వేరేగా, మగ పిల్లలకు వేరేగా పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.

అసలు ఆడపిల్లలు పదో తరగతి వరకు కూడా చదువుకోవడానికి గతంలో నిషేధం విధించిన తాలిబన్లు, ఈసారి డిగ్రీ వరకు కాలేజీలు, యూనివర్సిటీలలో చదువుకొనేందుకు అనుమతిస్తుండటం చాలా ఆశ్చర్యకరమే. మహిళల హక్కులు గౌరవిస్తామని చెప్పిన తాలిబన్లు, ఇప్పటికే పలుచోట్ల వారికి నరకం చూపిస్తున్నారు. దాంతో ఆడపిల్లల తల్లితండ్రులు తమ పిల్లలను గుమ్మం దాటి బయటకు పంపించడానికే వెనకాడుతున్నారు. ఒకవేళ వారు తాలిబన్ల చేతికి చిక్కితే వారిని ఎత్తుకుపోయీ వారిపై అత్యాచారాలు చేయడమో లేదా కటినంగా శిక్షించడమో చేస్తారని తల్లితండ్రులు భయపడుతున్నారు. కనుక ఇప్పట్లో ఆఫ్ఘనిస్తాన్‌లో ఆడపిల్లలు గుమ్మం దాటి బయటకు వచ్చే అవకాశమే లేదు కనుక తాలిబన్లు కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం విధించినా పెద్దగా తేడా ఉండకపోవచ్చు.

Related Post