ఒక్క పాజిటివ్ కేసు...దేశమంతటా లాక్‌డౌన్‌!

August 18, 2021
img

న్యూజిలాండ్‌లో మంగళవారం కొత్తగా ఒక పాజిటివ్ కేసు బయటపడటంతో ఆ దేశ ప్రధాని జేసిందా ఆర్నెడ్  సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా యావత్ దేశంలో మూడు రోజులు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆక్లాండ్‌కు చెందిన వ్యక్తికి కరోనా సోకిన తరువాత కోరమండల్ అనే ప్రాంతానికి వెళ్ళినట్లు తెలియడంతో ఆ రెండు ప్రాంతాలలో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని అర్నాడ్ ప్రకటించారు. గత కొన్ని నెలలుగా న్యూజిలాండ్‌లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానప్పుడు ఆ వ్యక్తికి కరోనా ఎలా సోకిందో తెలుసుకొనేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపారు. 

న్యూజిలాండ్‌లో ఒక్క కేసు బయటపడితేనే లాక్‌డౌన్‌ విధించారు కానీ భారత్‌లో రోజుకి సుమారు 30 వేల కొత్త కేసులు నమోదవుతున్నా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కరోనా జాగ్రత్తలు పాటించాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకొంటుంటే, చాలామంది ప్రజలు కనీసం మాస్కులు కూడా ధరించకుండా బహిరంగప్రదేశాలలో తిరుగుతున్నారు. భారత్‌లో థర్డ్ వేవ్ మొదలవుతుందని శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

Related Post