ఆఫ్ఘాన్ సమస్యతో మాకు సంబందం లేదు: బైడెన్‌

August 17, 2021
img

ఆఫ్ఘనిస్తాన్‌ దేశం, ప్రభుత్వం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడ భయానక పరిస్థితుళు నెలకొన్నాయి. ప్రజలు ప్రాణాలరచేత పట్టుకొని ఇరుగుపొరుగుదేశాలకు పారిపోతున్నారు. నిన్న కాబూల్ నుంచి బయలుదేరిన ఓ విమానంలో ఎక్కేందుకు వందలాదిమంది ప్రయత్నించారు. విమానంలోకి ప్రవేశించలేకపోయినవారిలో ఇద్దరు వ్యక్తులు విమానం టైర్లపై ఎక్కి కూర్చొని అది గాలిలోకి లేచిన తరువాత ఆకాశంలో నుంచి కిందపడి చనిపోయారు. ఇది అక్కడి దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో హటాత్తుగా ఏర్పడిన ఈ సంక్షోభానికి అమెరికాయే కారణమంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీటిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందిస్తూ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకొన్నారు. ఆయన నిన్న వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆఫ్ఘనిస్తాన్‌  నుంచి మా సైనికుల ఉపసంహరణ సరైన నిర్ణయమే. దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పటికే రెండు దశాబ్ధాలుగా ఆఫ్ఘనిస్తాన్‌లో మా సేనాలున్నాయి. మరో దశాబ్దం పాటు ఉన్నా అక్కడి పరిస్థితులలో మార్పు రాదు. కనుక మా సేనల ఉపసంహరణకు సరైన సమయం అంటూ ఎప్పుడూ ఉండదు. ఈ సుదీర్గయుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో నలుగురు అధ్యక్షులు మారారు. కనుక మరో  దశాబ్దం పాటు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఈ సమస్యను నా తరువాత వచ్చే అధ్యక్షుడుకి కూడా బదిలీ చేయాలని  నేను కోరుకోవడం లేదు. అందుకే సేనల ఉపసంహరణకు నేను కట్టుబడి ఉన్నాను.

మా లక్ష్యం ఉగ్రవాద నిర్మూలనే కానీ ఆఫ్ఘనిస్తాన్‌ దేశాన్ని కాపాడటం, పునర్నిర్మించడం కాదు. అయినప్పటికీ రెండు దశాబ్ధాలుగా మేము ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం నిలద్రొక్కుకోవడానికి అన్ని విదాల సహాయసహకారాలు అందజేశాము. బిలియన్ల డాలర్లు ఖర్చు చేశాం. వారి సైన్యానికి అవసరమైన అన్ని వనరులు, శిక్షణ అందించి తోడ్పడ్డాము. కానీ వారిలో సంకల్పబలం కల్పించలేకపోయాము. అందుకే ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఇది ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్‌ పాలకులు, సైనికుల వైఫల్యమే తప్ప మాది కాదు. 

ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలకు ఎప్పుడూ మేము అండగా ఉంటాము. వారిపై తాలిబన్లు దాడులు చేస్తే సహించేబోము. తప్పకుండా తీవ్ర చర్యలు తీసుకొంటాము,” అని జో బైడెన్‌ అన్నారు.

Related Post