ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల వశం...దేశాధ్యక్షుడు పరారి

August 16, 2021
img

అమెరికన్ సేనలు ఆఫ్ఘనిస్తాన్‌ విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఆ దేశం మళ్ళీ తాలిబన్ల వశం అయింది. దేశంలో ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకొంటూ వచ్చిన తాలిబన్లు నిన్న రాజధాని కాబూల్ నగరాన్ని చుట్టుముట్టడంతో ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నిన్న తన పదవికి రాజీనామా చేసి తన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులతో కలిసి దేశం విడిచి పారిపోయారు. ఆయన తజకిస్తాన్‌కు వెళ్ళిపోయినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్‌ ఉపాధ్యక్షుడు అమృల్లా సలే మాత్రం దేశం విడిచి వెళ్ళేందుకు ఇష్టపడలేదు. కాబూల్ నగరంలోకి ప్రవేశించిన తాలిబన్లు నిన్న ఆదివారం అధ్యక్ష భవనానికి వెళ్ళి ఆయనతో చర్చలు జరిపారు. ఆయన తాలిబన్లకు అధికారం అప్పగించి తప్పుకొనేందుకు అంగీకరించారు. కనుక తాలిబన్లు నిన్న కాబూల్ నగరంలో ప్రవేశించినప్పటికీ ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడలేదు.

 

రాజధాని కాబూల్ తాలిబన్లు వశపరుచుకోవడంతో భారత్‌ తన దౌత్య సిబ్బందిని, పౌరులను స్వదేశానికి తరలించేందుకు చర్యలు చేపట్టింది. నిన్న అతికష్టంతో 129 మందిని ఎయిర్ ఇండియా విమానంలో స్వదేశానికి తీసుకురాగలిగింది. అయితే అమెరికా చాలా చురుకుగా స్పందిస్తూ రాయబార కార్యాలయానికే హెలికాప్టర్లను పంపించి తన సిబ్బందిని తీసుకుపోయింది. కార్యాలయంలో ఉన్న కీలకమైన పత్రాలను తగులబెట్టింది. దేశం పూర్తిగా తాలిబన్లవశం అవడంతో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు దశాబ్ధాల తరువాత వారి క్రూరమైన పరిపాలన ప్రారంభం కాబోతోంది. దీంతో దేశ ప్రజలు, ముఖ్యంగా వారి ఆంక్షలకు బలైపోయే మహిళలు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు.

Related Post