అమెరికాలో మళ్ళీ కరోనా విలయతాండవం

August 10, 2021
img

కరోనా మహమ్మారికి భారీ మూల్యం చెల్లించిన దేశాలలో అమెరికా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ సమర్ధవంతమైన చర్యలతో ఎట్టకేలకు దాని నుంచి బయటపడటమే కాకుండా భారత్‌తో సహా పలు దేశాలకు అన్ని విధాలా సాయపడింది కూడా. కానీ కరోనాకు కొత్త రూపంగా చెప్పుకోబడుతున్న ‘డెల్టా వైరస్’ అమెరికాలో విజృంభిస్తోంది. అమెరికాలో టెక్సాస్, ఫ్లోరిడా తదితర రాష్ట్రాలలో డెల్టా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం రోజుకి సుమారు లక్ష కొత్త కేసులు చొప్పున నమోదవుతున్నాయి. వారిలో 15 శాతం చిన్న పిల్లలున్నట్లు ది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సర్వే చేసి ప్రకటించింది. 

తాజా సమాచారం ప్రకారం సోమవారం ఫ్లోరిడాలో 28,317 కొత్త కేసులు నమోదు కాగా వారిలో ప్రతీ ఐదుగురిలో ఒకరు పిల్లలున్నారని ది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలిపింది. అమెరికాతో సహా పలుదేశాలలో ఇంకా పిల్లలకు కరోనా టీకాలు వేయనేలేదు. కనుక ఈసారి పిల్లలు కూడా కరోనా బారినపడుతుండటం చాలా ఆందోళనకరమైన విషయమే. 

అమెరికాలో మళ్ళీ కరోనా విజృంభించడంతో మళ్ళీ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. అమెరికాలో మళ్ళీ కరోనా విజృంభిస్తుండటంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పలు రాష్ట్రాలలో మళ్ళీ కరోనా ఆంక్షలు అమలుచేస్తూ మరో పక్క కరోనా టీకాలు వేసే ప్రక్రియను వేగవంతం చేశాయి.

Related Post