అమెరికాలో ఒక్కరోజే లక్షన్నర కరోనా కేసులు!!!

August 04, 2021
img

అమెరికాలో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 1,49,788 కరోనా కేసులు బయటపడ్డాయి. టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలలో ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల నుంచి క్రమంగా కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. కానీ ఇంత తక్కువ సమయంలోనే ఈ స్థాయికి చేరుకొంటుందని ఎవరూ ఊహించకపోవడంతో   అందరూ ఉలిక్కిపడ్డారు. గడచిన 24 గంటలలో అమెరికా వ్యాప్తంగా మొత్తం 668 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ప్రపంచదేశాలన్నిటిలో అమెరికాలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 

భారత్‌లో కరోనా వాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు టీకా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే, టీకాలు వేసుకొనేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. కనుక టీకాలు వేసుకొంటే విద్యార్దులకు స్కాలర్‌షిప్పులు, యువతకు బీర్లు, బహుమతులు, కొన్ని రాష్ట్రాలలో భారీ నగదు బహుమతులు ఇస్తున్నాయి కూడా. 

అమెరికాతో పోలిస్తే భారత్‌లో నిరక్షరాస్యులు, నిరుపేదలు, మూడాచారాలు, కట్టుబాట్లు, అపోహలు, భయాలు ఎక్కువే అయినా వారు కూడా టీకాలు వేయించుకొంటున్నారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రజలు టీకాలు వేయించుకొనేందుకు నిరాసక్తత చూపుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. టీకాలు వేసుకొంటే 100 డాలర్లు నగదు బహుమతి ఇవ్వాలని జో బైడెన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 

అమెరికాలో కరోనా కేసులు హటాత్తుగా పెరగడానికి అమెరికన్ల జీవనశైలి, టీకాలు వేసుకోకపోవడం, కరోనా తీవ్రత తగ్గిపోయిందనే ఉద్దేశ్యంతో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వంటి  కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కరోనా కేసులు పెరగడంతో అమెరికాలో పలు రాష్ట్రాలలో మళ్ళీ కరోనా ఆంక్షలు అమలుచేస్తున్నాయి. అందరూ మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాలలో భౌతికదూరం పాటించాలని పలు రాష్ట్రాలు ఆదేశిస్తున్నాయి. టీకాలు వేసే ప్రక్రియ కూడా జోరందుకొంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు కరోనా మహమ్మారిని ఎదుర్కొని గుణపాఠాలు నేర్చుకొన్న అమెరికా ఈసారి దాని బారిన పడకుండా తప్పించుకొంటుందని ఆశిద్దాం.

Related Post