అమెరికాలో తెలుగు యువకుడికి అపూర్వమైన గౌరవం

July 20, 2021
img

అమెరికాలో తెలుగు యువకుడికి అపూర్వమైన గౌరవం లభించింది. విశాఖ జిల్లాకు చెందిన కామేశ్వర మంత (భరద్వాజ్) అనే యువకుడికి ఖగోళ శాస్త్రంలో చేసిన పరిశోధనలకుగాను అమెరికాలోని యుఎంకేసీ యూనివర్సిటీ డాక్టరేట్ డిగ్రీ ప్రధానం చేసింది. 

భరద్వాజ్ హైదరాబాద్‌, విజయవాడలో విద్యాభ్యాసం చేసిన తరువాత కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ (ఈసీఈ) చేశారు. తరువాత ఉన్నత చదువుల కోసం 2014లో అమెరికా వెళ్ళారు. అక్కడి యుఎంకేసీ యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షలో ప్రధమస్థానంలో సాధించడంతో ఖగోళశాస్త్రంలో పరిశోధనలకు అర్హత సాధించారు. అప్పటి నుంచి ఏడేళ్ళ పాటు నిరంతరంగా విశ్వంలో నక్షత్రమండలాలు ఢీకొనే క్రమంపై ఖగోళ పరిశోధనలు చేస్తూ అనేక అద్భుతమైన విషయాలు కనుగొన్నారు. 

ఆయన పరిశోధనల ప్రాధాన్యతను గుర్తించి అమెరికాలో 8 ప్రముఖ సంస్థలు ఆయనకు ఉపకారవేతనాలు అందజేశాయి. ఖగోళశాస్త్రంలో ఆయన చూపిన ప్రతిభకు యూనివర్సిటీ డాక్టరేట్ డిగ్రీతో గౌరవించింది. ఆ యూనివర్సిటీ నుంచి ఖగోళశాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీ పొందిన మొట్టమొదటి వ్యక్తి భరద్వాజ్! అమెరికా ఆస్ట్రోనామికల్ సొసైటీ భరద్వాజ్‌ ప్రతిభను గుర్తించి స్వర్ణపతకంతో గౌరవించింది. ప్రస్తుతం భరద్వాజ్ చేస్తున్న మరో పరిశోధనకు నాసా ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.        

తన ఈ పరిశోధనలలో ప్రొఫెసర్ దానియెల్ మాకింటోస్, ప్రొఫెసర్ బ్రాడ్‌విన్ ఎంతగానో సహాయపడుతూ మార్గదర్శనం చేసి ప్రోత్సహించారని, తనకు లభించిన ఈ గుర్తింపు, గౌరవం అంతా వారి పుణ్యమేనని భరద్వాజ్ అన్నారు.

Related Post