ఆ పోలీస్ అధికారికి 22 ఏళ్ళు జైలు శిక్ష

June 26, 2021
img

అమెరికాలో సంచలనం సృష్టించిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ హత్య కేసుపై మిన్నియాపోలీస్ కోర్టు నిన్న తుది తీర్పు ప్రకటించింది. ఆ హత్య కేసులో పోలీస్ అధికారి డెరిక్ చౌవిన్‌ను దోషిగా నిర్ధారించి అతనికి 22 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పింది. ఒకవేళ శిక్షాకాలంలో అతను సత్ప్రవర్తనతో మెలిగినట్లయితే 15 ఏళ్ళ తరువాత పెరోల్ (బయటకు వెళ్ళి వచ్చేందుకు) అనుమతించవచ్చని కోర్టు ఆదేశించింది.    

గత ఏడాది మే 25న జార్జి ఫ్లాయిడ్‌ మిన్నియాపోలీస్ నగరంలో ఓ షాపులో వస్తువులు కొనుక్కొన్న తరువాత అతను నకిలీ నోటు ఇచ్చాడనే షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డెరిక్ చౌవిన్‌ మరో ఇద్దరు పోలీస్ అధికారులతో కలిసి హుటాహుటిన అక్కడకు చేరుకొని జార్జి ఫ్లాయిడ్‌ను బందించి నేలపై పడుకోబెట్టాడు. తరువాత డెరిక్ చౌవిన్‌ ఆ నల్లజాతీయుడి మెడపై బలంగా మోకాలితో నొక్కి పట్టుకొన్నాడు. అతను ‘నాకు ఊపిరి అందడం లేదని’ చెపుతున్నప్పటికీ పట్టించుకోకుండా మరింత గట్టిగా మోకాలితో అదమడంతో జార్జి ఫ్లాయిడ్‌ ఊపిరి అందక చనిపోయాడు. 


అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో అది మరింత సంచలనం అయ్యింది. ఆ కేసుపై విచారణ జరిపిన మిన్నియా పోలీస్ కోర్టు హంతక పోలీస్ అధికారి డెరిక్ చౌవిన్‌కు 22 ఏళ్ళు జైలు శిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Related Post