అమెరికా వచ్చే విద్యార్దులకు వ్యాక్సిన్‌ తప్పనిసరి కాదు

June 12, 2021
img

కరోనా మహమ్మారితో తల్లడిల్లిపోయిన అమెరికా ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో ఈనెల 14వ తేదీ నుంచి విదేశీ విద్యార్ధులకు వీసా అపాయింట్‌మెంట్ల ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించింది. అయితే అమెరికాకు వచ్చే విద్యార్దులు వాక్సిన్ వేసుకోవాలనే నిబందన ఏమీ విధించలేదని కనుక వారు అమెరికా చేరుకొన్న తరువాత కూడా యూనివర్సిటీలలోనే టీకాలు వేసుకోవచ్చునని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ తెలిపింది. ఒకవేళ అమెరికాలోని విద్యార్దులు చేరబోయే యూనివర్సిటీలు తప్పనిసరిగా టీకాలు వేసుకొని రావాలని సూచిస్తే మాత్రం వాటి నిర్ణయాన్ని పాటించాలని స్పష్టం చేసింది. టీకా వేసుకొన్నా వేసుకోకపోయినా విద్యార్దులు అమెరికాకు బయలుదేరే మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకొని విమానం ఎక్కేటప్పుడు నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

అమెరికన్ యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన విద్యార్దులు జూన్, జూలై నెలల్లో జరిగే సెమిస్టర్స్‌కు హాజరయ్యేందుకు వీసా దొరికే అవకాశం లేదని తమ యూనివర్సిటీలతో మాట్లాడుకొని సెమిస్టర్ పొడిగించుకోవాలని సూచించారు. ఆగస్ట్ సెమిస్టర్‌కు హాజరయ్యే విద్యార్దులను అదే నెలలో వెళ్ళేందుకు వీసాలు జారీ చేస్తామని, ముందుగా వెళ్ళేందుకు కుదరదని తెలిపారు. ఇదివరకే వీసాల ఫీజు చెల్లించినవారు మళ్ళీ ఫీజు చెల్లించనవసరం లేదని తెలిపారు. 

విద్యార్దులు అమెరికన్ వీసాల కోసం https://www.ustraveldocs.com/in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వీటికి సంబందించిన పూర్తి వివరాల కొరకు https://in.usembassy.gov/visas వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎంబసీ అధికారులు సూచించారు. 

ప్రస్తుతం విద్యార్దులను మాత్రమే అనుమతిస్తున్నామని, తల్లితండ్రులు, పర్యాటకులకు ఇప్పట్లో వీసాలు మంజూరు చేసే అవకాశం లేదని తెలిపారు.

Related Post