కోవాక్సిన్‌తో కొత్త సమస్య

May 24, 2021
img

ఆస్ట్రాజెనికా, ఫైజర్, మోడెర్నా, జాన్సన్ కంపెనీలు తయారుచేసిన వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించడంతో వాటిని భారత్‌తో సహా అన్ని దేశాలు కూడా ఆమోదించాయి. కానీ భారత్‌లో తయారైన కోవాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించకపోవడంతో ఉత్తర అమెరికా, యూరోప్, గల్ఫ్ దేశాలు కూడా దానిని ఆమోదించడంలేదు. దీంతో కోవాక్సిన్‌ వేసుకొన్న ఎన్‌ఆర్ఐలు కొత్త సమస్య ఎదుర్కొంటున్నారు. 

ఆ నాలుగు కంపెనీల వాక్సిన్లలో ఏదైనా వాక్సిన్ వేసుకొన్నట్లు దృవీకరణ పత్రం ఉంటేనే విమానయాన సంస్థలు ప్రయాణానికి అనుమతిస్తున్నాయి. 

మరో సమస్య ఏమిటంటే భారత్‌లో ఈ వాక్సినేషన్ ప్రక్రియను కూడా ఆధార్ కార్డు ద్వారానే చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక చాలామంది ఎన్‌ఆర్ఐలు తమ ఆధార్ కార్డు చూపి వాక్సిన్ రెండు డోసులు వేసుకొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన కోవీషీల్డ్ వాక్సిన్‌ వేసుకొన్నప్పటికీ వారిని విదేశాలకు తిరిగి వచ్చేందుకు అనుమతించడం లేదని తెలుస్తోంది. పాస్‌పోర్ట్‌ దృవీకరణతో వాక్సిన్‌ వేసుకొన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విదేశాల నుంచి భారత్‌ వచ్చి మళ్ళీ విదేశాలకు తిరిగివెళ్ళాలనుకొనేవారు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. 

Related Post