బాంబుల వర్షం కురిపించుకొంటున్న ఇజ్రాయెల్, పాలస్తీనా

May 13, 2021
img

ఈ కరోనా కష్టకాలంలో ఇజ్రాయెల్, పాలస్తీనాల మద్య చిన్నగా మొదలైన ఘర్షణ పరస్పరం బాంబుల వర్షం కురిపించుకొనే వరకు వెళ్లడంతో రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలలో భయానకమైన వాతావరణం నెలకొంది. పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశంపై రోజూ వందలాది రాకెట్లతో దాడులు చేస్తుంటే, ఇజ్రాయెల్ కూడా పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు చేస్తూ ఆకాశంలో నుండి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ పరస్పరదాడులలో ఏడుగురు ఇజ్రాయెల్‌ పౌరులు మరణించగా, గాజా స్ట్రిప్‌లో 16 మంది చిన్నారులతో సహా మొత్తం 86 మంది మరణించారు. 

ఇజ్రాయెల్ ప్రభుత్వం తన సరిహద్దు ప్రాంతాలపై రాకెట్ దాడులను అడ్డుకొనేందుకు అత్యంత శక్తివంతమైన, అత్యాధునికమైన ‘ఐరన్ డోమ్’ అనే వ్యవస్థను వినియోగిస్తుండటంతో ఆ దేశంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా తక్కువగా ఉంది. కానీ ఇజ్రాయెల్ వైమానిక దళాలు నేరుగా గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించి పైనుంచి బాంబుల వర్షం కురిపిస్తుండటంతో అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రెండూ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులలో ప్రతీరోజు వందలాదిమంది పాలస్తీనా పౌరులు గాయపడుతున్నారు. అయినప్పటికీ ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పరస్పరం దాడులు చేసుకొంటుండటంతో మారణహోమం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

Related Post