విడిపోతున్న బిల్ గేట్స్ దంపతులు

May 04, 2021
img

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (65), మెలిందా (56) త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు. ఈవిషయం వారే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా అందరికీ తెలియజేశారు. “మేమిరువురం ఎంతో లోతుగా ఆలోచించిన తరువాత విడిపోవాలని నిర్ణయించుకొన్నాము. గత 27 ఏళ్ళలో ముగ్గురు పిల్లలను అద్భుతంగా తీర్చి దిద్దాము. మా బిల్ గేట్స్ మెలిందా ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా జీవించేందుకు కలిసి కృషి చేశాం. కానీ ఇకపై మేము భార్యాభర్తలుగా కొనసాగలేమని గ్రహించాము. కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు వీలుగా, విడిపోవాలని మేము తీసుకొన్న మా ఈ వ్యక్తిగత నిర్ణయాలను అందరూ గౌరవిస్తారని భావిస్తున్నాం. బిల్ గేట్స్ మెలిందా ఫౌండేషన్‌లో మేమిరువురం యధాప్రకారం కలిసే పనిచేస్తాం,” అని బిల్ గేట్స్ దంపతులు ట్వీట్ చేశారు. 

ఎంబీఏ చేసిన మెలిందా మైక్రోసాఫ్ట్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్‌గా  చేరినప్పుడు వారిరువురి మద్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 1994లో వారు వివాహం చేసుకొన్నారు. ఆ తరువాత 2000 సం.లో బిల్ గేట్స్ మెలిందా ఫౌండేషన్‌ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా 53 మిలియన్ డాలర్లను ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. ఆఫ్రికాలో నిరుపేద దేశాలకు ఉచితంగా కరోనా వాక్సిన్ అందజేసేందుకు ఆ సంస్థ కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తోంది. ఇంత ఉదాత్తమైన జీవితం గడుపుతున్న బిల్ గేట్స్ దంపతులు విడిపోవడం చాలా ఆశ్చర్యకరమే.

Related Post