భారత్‌కు అండగా నిలబడతాం: అమెరికా

April 26, 2021
img

ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు సహాయపడేందుకు అంగీకరించారు. గత ఏడాది కరోనా క్లిష్ట సమయంలో తమకు మందులు పంపి సహాయపడిన భారత్‌, ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులలో ఉందని కనుక ఇప్పుడు తాము భారత్‌కు అన్నివిదాల సహాయసహకారాలు అందిస్తామని జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రకటించారు. వారు ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ భారత్‌కు అత్యవసరమైన మందులు, వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడిసరుకు, వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ యూనిట్లు, పీపీఈకిట్లు, టెస్టింగ్ కిట్లు వగైరాలను వీలైనంత త్వరగా భారత్‌కు పంపిస్తామని చెప్పారు. ఇప్పటికే 300 ఆక్సిజన్ తయారీ యూనిట్లను, 5 టన్నుల ఆక్సిజన్‌ను భారత్‌కు పంపించామని చెప్పారు. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మొదట భారత్‌ పరిస్థితి పట్ల చాలా నిర్లిప్తంగా వ్యవహరించిన మాట వాస్తవం. అయితే ఆయన ప్రభుత్వంలో భారత్‌ సంతతికి చెందిన పలువురు సెనేటర్లు, పలువురు ప్రముఖులు భారత్‌ను ఆదుకోవలసిందిగా ఒత్తిడి పెంచడంతో చివరికి జో బైడెన్‌ అంగీకరించారు తప్పలేదు. కనుక ఆనాడు ప్రధాని నరేంద్రమోడీ అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ టాబ్లెట్స్ పంపినందుకు కృతజ్ఞతగా కాదని చెప్పవచ్చు. కారణం ఏదైనప్పటికీ భారత్‌ క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు అమెరికా అందించబోయే ఈ సాయం చాలా అమూల్యమైనదని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఆక్సిజన్ తయారుచేసే యూనిట్లు, ఆక్సిజన్, కోవీషీల్డ్, కోవాక్సిన్‌ల తయారీకి అవసరమైన ముడిసరుకును పంపించడం ద్వారా ఎంతో మహోపకారం చేసినట్లే భావించవచ్చు. 

Related Post