ఎవ్వర్ గ్రీన్‌ సంస్థకు రూ.7,500 కోట్లు జరిమానా

April 14, 2021
img

ఇటీవల సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ఎవర్ గ్రీన్‌ కంటెయినర్ రవాణా నౌక యాజమాన్యానికి మరో పెద్ద సమస్య ఎదురైంది. సుమారు వారం రోజులపాటు సూయజ్ కాలువలో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలిగించి లక్షల కోట్ల నష్టం వాటిల్లినందుకుగాను ఎవర్ గ్రీన్‌ నౌక యాజమాన్యంకు వంద కోట్ల డాలర్లు (రూ.7,500 కోట్లు) జరిమానా విధిస్తున్నట్లు ఈజిప్ట్ న్యాయస్థానం ప్రకటించింది. ఈ జరిమానా చెల్లించేవరకు ఎవర్ గ్రీన్‌ నౌకను విడిచిపెట్టరాదని ఈజిప్ట్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. 

గత నెల 23వ తేదీన మలేషియా నుంచి నెదర్లాండ్‌లోని రోటర్‌డామ్‌కు వెళుతుండగా సూయజ్ కాలువలో ప్రయాణిస్తున్నప్పుడు బలమైన గాలులు వీచడంతో అంతా భారీ నౌక కాలువలో అడ్డంగా తిరిగి నౌక ముందు భాగం ఇసుకలో కూరుకుపోయింది. దాంతో ఆ మార్గం గుండా ప్రయాణించవలసిన వందలాది వాణిజ్యనౌకలు దాదాపు వారం రోజుల పాటు రెండువైపులా నిలిచిపోయాయి. ఆ కారణంగా లక్షల కోట్లు నష్టం జరిగింది. ఎట్టకేలకు అతికష్టం మీద ఎవర్ గ్రీన్‌ నౌకను ఇసుకలో నుంచి బయటకు లాగి ఈజిప్ట్ అంతర్జాతీయ జలాలలో లంగరు వేసి నిలిపి ఉంచారు. ఇప్పుడు వంద కోట్ల డాలర్లు జరిమానా చెల్లించేవరకు దానికి విముక్తి లభించేలా లేదు. ప్రస్తుతం ఆ నౌక యాజమాన్యం, ఈజిప్ట్ ప్రభుత్వంతో జరిమానా విషయమై చర్చలు జరుపుతోంది. 

Related Post