టికెట్ కు హామీ ఇస్తే చేరుతారుట!

November 17, 2017


img

టిటిడిపి సీనియర్ నేత ఉమా మాధవరెడ్డి పార్టీలో ఉన్నప్పటికీ, చాలా కాలంగా ఆమె పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. ఇటీవల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆమె కూడా చేరాలనుకొన్నారుట. అయితే టికెట్ గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో చివరి నిమిషంలో వెనక్కు తగ్గానని ఆమె స్వయంగా చెప్పారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి టికెట్ కు ఖచ్చితమైన హామీ లభించింది కనుకనే ఆయన చేరారని, ఒకవేళ తనకు హామీ ఇచ్చి ఉండి ఉంటే తాను కూడా చేరి ఉండేదానన్ని అన్నారు. తెలంగాణాలో తెదేపా పని అయిపోయినట్లే కనుక, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ హామీతో ఆహ్వానం వచ్చినట్లయితే తప్పకుండా ఆలోచిస్తానని ఉమా మాధవరెడ్డి అన్నారు. తనకు తెరాస నుంచి ఆహ్వానం వచ్చిందని కానీ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నానని అన్నారు. 

నల్లగొండ జిల్లాలో బోన్ గిరికి చెందిన ఆమె బలమైన నాయకురాలే కావచ్చు. కానీ అదే జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వంటి హేమాహేమీలైన నాయకులున్నారు. కనుక టికెట్ విషయంలో ఆమెకు హామీ ఇవ్వడం కష్టమేనని చెప్పవచ్చు. తెరాసలో కూడా టికెట్స్ కోసం చాలా పోటీ ఉంటుంది. కనుక ఆమె తన రాజకీయ భవిష్యత్ ను దృష్ట్యా ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తరువాత టికెట్ కోసం ప్రయత్నిస్తే మంచిదేమో? లేకుంటే ఆమెవంటి బలమైన నేతల కోసం ఎదురుచూపులు చూస్తున్న భాజపా ఉండనే ఉంది. అందులో ఆమె చేరదలిస్తే ముందుగానే టికెట్ ఖరారు చేసుకోవచ్చు. 



Related Post