మాజీ కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్ బాటలో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా నడవాలనుకొన్నారు. పొన్నం కనీసం మూడు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయగలిగారు కానీ జగ్గారెడ్డి దీక్ష ప్రారంభించక మునుపే పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన దీక్ష మొదలవక మునుపే ముగిసింది.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ జగ్గారెడ్డి నేటి నుంచి కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. తన అనుచరులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరుతుంటే, దీక్షకు అనుమతి లేదని చెప్పి పోలీసులు జగ్గారెడ్డిని, అనుచరులను అదుపులోకి తీసుకొని జోగిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పొన్నం ప్రభాకర్ కూడా ఇటువంటి డిమాండ్ తోనే కరీంనగర్ లో దీక్షకు కూర్చొన్నారు. మూడు రోజులు కాగానే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. తరువాత ఆయన దీక్ష విరమించారు. ఆ తరువాత మళ్ళీ అయన కరీంనగర్ జిల్లా కేంద్రంలో వైద్యకళాశాలను ఏర్పాటు చేయడం గురించి మాట్లాడలేదు. బహుశః జగ్గారెడ్డి కూడా ఇక్కడితో ఈ కధ ముగిస్తారేమో?