అమృతధారలు-5

May 03, 2017


img

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో అంతే వేగంగా జనాభా కూడా పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా ఆకాశాన్ని అంటే బహుళ అంతస్తుల భవనాలు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఆ కారణంగా నగరంలో ఉండే వందలాది చిన్నా పెద్ద చెరువులు కనబడకుండా మాయం అయిపోయాయి. వాటి స్థానంలో బోర్ వెల్స్ కనబడుతున్నాయి. 

ఒకప్పుడు హైదరాబాద్ మంచి నీటి చెరువులకు రాజధానిగా ఉండేది. కానీ ఇప్పుడు 26 లక్షల బోర్ వెల్స్ తో బోర్ వెల్ రాజధానిగా మారింది. అనధికార లెక్కల ప్రకారం హైదరాబాద్ లో ప్రతీరోజు కొత్తగా కనీసం 250-300 బోర్ వెల్స్ తవ్వుతూన్నారని సమాచారం. ఆ లెక్కన నెలకి ఎన్ని..సంవత్సరానికి ఎన్ని తవ్వుతున్నారు అని తేలికగానే లెక్కలు కట్టవచ్చు కానీ ఆ చేదు నిజం జీర్ణించుకోవడమే కష్టం. 

భూమికి ఇన్ని లక్షల రంద్రాలు చేసి విచ్చలవిడిగా నీటిని తోడేసుకొంటున్నా కనీసం వాటిలో 10వ వంతు బోర్లలో వర్షపు నీటితో మళ్ళీ రీఛార్జ్ చేయాలని ఎవరూ అనుకోకపోవడం మన అవగాహనా రాహిత్యానికి లేదా నిర్లక్ష్యానికి నిదర్శనంగా, ప్రభుత్వ పర్యవేక్షణ లోపంగా చెప్పుకోక తప్పదు. 

ఒకప్పుడు అంటే 1980లలో అమీర్ పేట వద్ద గల ఎస్.ఆర్.నగర్ లో కేవలం 60 అడుగుల లోతులో నీళ్ళు పడేవి. 10 సం.లు గడిచేసరికి అది 100-150 అడుగులకి, మరో 10 సం.లకి అంటే 2000 సం.నాటికి 500-600 అడుగులకి, 2010 సం.వచ్చే సరికి 1,000 నుంచి 1500 అడుగుల లోతుకి నీళ్ళు వెళ్ళిపోయాయి. 

చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే, భూగర్భ జలాలు అడుగంటి పోతున్న కొద్దీ ఇంకా ఇంకా లోతుగా బోర్లు తవ్వేందుకు ఆధునిక యంత్ర పరికరాలను సమకూర్చుకొన్నామే తప్ప వర్షపు నీటిని భూమిలోకి పంపించి భూగర్భ జలాలను పైకి రప్పించుకొందామని ఎవరూ ఆలోచించలేదు. 

ఇప్పుడు పరిస్థితి ఎంతగా విషమించింది అంటే చాలా చోట్ల 1,000-1500 అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్ళు పడతాయనే నమ్మకం లేదు. ఒకవేళ అంత లోతులో నీళ్ళు పడినా అసాధారణ స్థాయి నుంచి తోడి తీస్తున్న ఆ నీటిలో మనుషులకు హాని కలిగించే అనేక ప్రమాదకరమైన పదార్ధాలు ఉండే అవకాశాలే ఎక్కువ. పైగా అంత లోతులో బోర్లు తీస్తునప్పుడు నీళ్ళు రాకపోయినా చాల బారీ స్థాయిలో మట్టి, రాతిపొడి పైకి వస్తుంది. అది ఆ చుట్టుపక్కల గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుంది. తరువాత అది క్రమంగా పరిసర ప్రాంతాలకు పరుచుకొని వాయు కాలుష్యం, నేల కాలుష్యం, జల కాలుష్యం అయిపోతోంది. 

ఈ సమస్యకు కూడా మనం మరో అసాధారణమైన ప్రత్యామ్నాయం కనుగొన్నాము. అదే నీళ్ళ ట్యాంకర్లు...మినరల్ వాటర్ బాటిల్స్.. ఒక సమస్యకు సులువైన పరిష్కారం ఉందని తెలిసి కూడా ఇటువంటి చిత్ర విచిత్రమైన ఆలోచనలు చేయడం బహుశః మానవులకే చెల్లునేమో?  

ఇప్పుడు ఏ నగరం, పట్టణం, గ్రామంలో చూసినా బోర్ వేల్స్ తవ్వే యంత్రాలు, నీళ్ళ ట్యాంకర్లు, మినరల్ వాటర్ బాటిల్ సరఫరా చేసే వ్యానులే కనిపిస్తుంటాయి. వాటిని చూసి మనం చాలా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసుకొన్నామని గర్వపడుతుంటాము. కానీ అవి మన నిర్లక్ష్యానికి, అవగాహనారాహిత్యానికి నిదర్శనాలని...అవి భవిష్యత్ ప్రమాదగంటికలు అని ఎవరూ భావించము. 

ప్రభుత్వాలు కూడా ప్రతీ వీధికి మంచినీళ్ళ ట్యాంకర్లు సరఫరా చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నాము. దాని కోసం ప్రభుత్వాలు లక్షల రూపాయలు ఖర్చు చేయడం, మళ్ళీ ఆ భారం ప్రజలపైనే వేయడం దశాబ్దాలుగా ఒక సైకిల్ లాగా సాగిపోతోంది తప్ప నానాటికీ భూగర్భ జలాలు ఎందుకు అడుగంటిపోతున్నాయి? వాటిని పునరుద్దరించుకోవడానికి మనం ఏమి చేయాలి? ఏమి చేస్తున్నాము? ఎందుకు చేయడం లేదు? అని ఎవరూ ప్రశ్నించుకోవడం లేదు. చాలా మంది కనీసం ఆలోచించడానికి కూడా ఇష్టపడటం లేదు. 

కోట్లు ఖర్చు చేసి అపార్టుమెంట్ లు, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నవారు, వాటిలో నివసించేవారికి తాగడానికి, వాడకానికి మంచి నీళ్ళు అందించగలమా లేదా అని కూడా ఆలోచించకపోవడాన్ని ఏమనుకోవాలి? 

ప్రతీ ఇల్లు, ప్రతీ అపార్టుమెంటు రూఫ్ లు వర్షపు నీటిని క్యాచ్ చేసే గిన్నెల వంటివే. ఎంత విశాలమైన భవనం అయితే అంత పెద్ద గిన్నె అని భావించవచ్చు. కానీ వాటి నుండి వచ్చే అమృతధారల వంటి వర్షపు నీటిని భూమిలోకి పంపించడానికి ఏర్పాట్లు చేసుకొనే బదులు బయట మురికికాలువలలోకి పంపించుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నాము. మనిషి చదువుకి, డబ్బుకి, తెలివితేటలకి, విచక్షణ జ్ఞానానికి, సామాజిక స్పృహకి ఎటువంటి సంబందమూ ఉండదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ వర్షపు నీటిని భూమిలోకి పంపించి ఉంటే, ఈ సమస్యలన్నీ ఉండేవి కావు కదా? అని ఈ రంగంలో కృషి చేస్తున్న సుబాష్ చంద్ర రెడ్డి అంటున్నారు.

నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు..ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలనుకొనేవారు.. సుబాష్ చంద్రరెడ్డి గారి సలహాలు, సేవలు పొందగోరేవారు.. సంప్రదించవలసిన ఈ మెయిల్ : saverainwater@gmail.com, ఫోన్: 9440055253

అమృతధారలు లింక్స్:

http://www.mytelangana.com/telugu/editorial/6674/subash-chandra-reddy-efforts-to-save-the-rain-water   

http://www.mytelangana.com/telugu/lifestyle/6678/subash-chandra-reddys-efforts-for-rain-water-conservation 

http://www.mytelangana.com/telugu/editorial/6694/rain-water-conservation-in-telangana-state  

 http://www.mytelangana.com/telugu/editorial/6771/suabsh-chandra-reddy-suggestions-and-efforts-for-rain-water-conservation 


Related Post