మనందరి కోసమే ఆయన కృషి...చేయి కలిపితే చాలు

April 22, 2017


img

సాధారణంగా మనం సినిమాలు, రాజకీయాలు లేదా మనకు ఏ మాత్రం సంబంధంలేని, ప్రయోజనం కలిగించని విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతుంటాము. కానీ నిత్యజీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం కోసం జరుగుతున్న చర్చల పట్ల, ప్రయత్నాల పట్ల ఆసక్తి కనబరచం. ఎందుకంటే వాటిలో మనం ఆశించిన ‘కిక్’ ఉండదు కనుక.

చాలా పెద్ద చదువులు చదివి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు సైతం చెప్పులు కూడా లేని ఒక మొక్కల రామయ్య సమాజం కోసం చేసినంత కృషి చేయలేరంటే అతిశయోక్తి కాదు. మనం పుట్టి పెరిగి జీవిస్తున్న ఈ భూమి కోసం, మన చుట్టూ ఉన్న సమాజం కోసం మనం ఎప్పుడూ ఏమీ చేయకపోయినా అందరూ ‘ఐ లవ్ మై ఇండియా..మేరా భారత్ మహాన్’ అని గర్వంగా చెప్పుకొంటూ, త్రివర్ణపతాకాల స్టికర్లని మన వాహనాల మీద, జెండా బొమ్మలను కార్లలో పెట్టుకోవడం మరిచిపోము. అదే మన దేశభక్తికి గొప్ప నిదర్శనంగా భావిస్తూ ఏమీ చేయకుండానే కాలక్షేపం చేసేస్తుంటాము. కానీ అందరూ అలాగే ఉండరు..ఆకాశం నుంచి పడే ప్రతీ నీటి బిందువుని ఒడిసిపట్టి సవినయంగా భూమాతకు అప్పగించాలని తపనపడే సుబాష్ చంద్రరెడ్డి వంటివారు కూడా చాలా మంది ఉన్నారు. 

సరూర్ నగర్ కు చెందిన సుబాష్ చంద్రరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్నారు. అంటే కేవలం ఉద్యోగం చేసుకొంటే చాలు.. జీవితంలో మరేమీ చేయనక్కరలేదు.. పూలనావలా సైగిపోతుంది. కానీ ఆయన అలాగ అనుకోలేదు కనుకనే నేడు అందరూ ఆయన గురించి చెప్పుకొంటున్నారు.

ఒక పక్క రాష్ట్రంలో ఎప్పుడూ నీటి కరువుతో అల్లాడుతున్న గ్రామాలు, పట్టణాలు..హైదరాబాద్ నగరం. మరోపక్క అమృతధారల వంటి వర్షపునీరు రోడ్లను ముంచెత్తి మురికి కాలువలలో పారుతుండటం సుబాష్ చంద్రరెడ్డిని చాలా ఆలోచింపజేసింది. అందుకే వర్షపు నీటిని నిలువ చేయడంపై చాలా లోతుగా అధ్యయనం చేసి హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వాటర్ హార్వెస్టింగ్ కోసం సుమారు రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు.

“ఈ భూమే అతిపెద్ద వాటర్ ట్యాంక్ వంటిది. దానిలో మనం ఎంతైన నీరు నింపుకోవచ్చు. కొద్దిపాటి ఖర్చుతో, చిన్న ప్రయత్నంతో వర్షపునీటిని మనం నిలువచేసుకోవచ్చు. కానీ చాలా మంది నీళ్ళకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ట్యాంకర్లు తెప్పించుకోవడమే దానికి ఏకైక పరిష్కారం అని భావిస్తారు తప్ప కళ్ళ ముందే మురికి కాల్వలలో వృధాగా కలిసిపోతున్న వర్షపునీటిని పొదుపు చేసుకోవాలని అనుకోరు. ఇక హైదరాబాద్ వంటి మహానగరంలో అయితే కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన అపార్టుమెంట్లు, విల్లాలు నిర్మిస్తారు..వాటిని ఇంకా అందంగా అలంకరించేందుకు దేశ విదేశాల నుంచి రకరకాల వస్తువులను తెప్పించి అద్భుతంగా తీర్చి దిద్దుతారు. అందమైన ల్యాండ్ స్కేప్ ఏర్పాటు చేస్తారు. కానీ వర్షపు నీటిని నిలువ చేసేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయరు. అదొక ఇబ్బంది లేదా అదనపు వృదా ఖర్చు అని భావిస్తారే తప్ప దాని వలన శాస్వితంగా నీటి సమస్య నుంచి తప్పించుకోవచ్చని ఎవరూ భావించరు. నగరంలో ఉన్న విద్యాధికులే ఈవిధంగా ఆలోచిస్తుంటే ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఏవిధంగా ఆలోచించాలి?” అని ప్రశ్నిస్తారు సుబాష్ చంద్రరెడ్డి. 

అది చిన్న ఇల్లైనా, బారీ అపార్ట్ మెంటులతో కూడిన హౌసింగ్ ప్రాజెక్టు అయినా, పట్టణమైన, గ్రామీణ ప్రాంతమైన సరే.. వర్షపునీటిని భూమిలోకి పంపించడం సాధ్యమే...చాలా అవసరమే అని అంటారు సుబాష్ చంద్రరెడ్డి. అప్పుడే ఈ నీటి సమస్యను శాస్వితంగా పరిష్కరించవచ్చునని దృడంగా చెపుతారు.

వర్షపు నీటిని భూమిలోకి పంపించి భూగర్భ జలాలను రీ- చార్జ్ చేయడానికి ఆయన చేస్తున్న కృషి గురించి, ఆయన విజయ గాధలు, ఆయన సేవలు, సలహాలు, సూచనలు, మొదలైన అన్ని వివరాలతో ‘మై తెలంగాణా.కామ్’ లో ఇక నుంచి ప్రతీ ఆదివారం “అమృత ధారాలు” పేరిట వరుసగా కధనాలు ప్రచురిస్తుంది. 

ఆయన దీని కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో ‘స్మరణ్’ అనే స్వచ్చంద సంస్థను స్థాపించారు. నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు..ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలనుకొనేవారు.. సుబాష్ చంద్రరెడ్డి గారి సలహాలు, సేవలు పొందగోరేవారు.. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్, ఈ మెయిల్ :

ఫోన్: 9440055253,

e-mail: saverainwater@gmail.com

web site: http://smaran.org/   

    




Related Post