హైదరాబాద్‌లో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ చెరో పక్కా?

April 25, 2024


img

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన 16 నియోజకవర్గాలు ఓ ఎత్తు అయితే హైదరాబాద్‌ ఒక్కటీ ఒక ఎత్తు.

ఇంతకాలం బిఆర్ఎస్  మజ్లీస్‌ పార్టీల మద్య దోస్తీ కొనసాగడంతో హైదరాబాద్‌ ఎంపీ సీటుని మజ్లీస్‌ పార్టీకే విడిచిపెడుతుండేది. కనుక అక్కడ నుంచి మజ్లీస్‌ ఎంపీ అసదుద్దీన్‌  ఓవైసీ తప్ప మరెవరికీ అవకాశం లేదన్నట్లు పరిస్థితి ఉండేది. 

అయితే బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మజ్లీస్‌ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు అవసరమైతే మేమున్నామని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సిఎం రేవంత్‌ రెడ్డికి హామీ కూడా ఇచ్చారు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు బెదిరిస్తున్నాయి కూడా. కనుక ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పేరుకి సొంత అభ్యర్ధిని నిలబెట్టినప్పటికీ, అసదుద్దీన్‌ ఓవైసీ గెలుపుకి సహకరించడం ఖాయమే అని భావించవచ్చు.   

అయితే ఈసారి హైదరాబాద్‌ ఎంపీ సీటుని ఎలాగైనా గెలుచుకొని మజ్లీస్‌ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని బీజేపీ చాలా పట్టుదలతో ఉంది. కనుక హిందుత్వ అజెండాతో దూసుకుపోయే మాధవీలతని పార్టీలో చేర్చుకొని మరీ టికెట్‌ ఇచ్చింది. ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కూడా. 

బిఆర్ఎస్ పార్టీ కూడా హైదరాబాద్‌ నుంచి అభ్యర్ధిని నిలబెట్టింది. ఇదివరకైతే అది మజ్లీస్‌కు మద్దతు ఇచ్చేదీ. కానీ మజ్లీస్‌ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో, బిఆర్ఎస్ పార్టీ పరోక్షంగా బీజేపీ గెలుపుకి సహకరించే అవకాశం ఉంది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత అరెస్టు కావడం, లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కలిసే అవకాశం ఉండటం, ఒకవేళ లేకున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలద్రోసేందుకు రెండు పార్టీలు సహకరించుకునే సూచనలు కనిపిస్తుండటం వంటివి హైదరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను దగ్గర చేసేందుకు దోహదపడే కారణాలుగా కనిపిస్తున్నాయి. 

కనుక ఈసారి హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ మజ్లీస్‌ పార్టీకి, బిఆర్ఎస్ బీజేపీకి లోపాయికారిగా సహకరించే అవకాశం కనిపిస్తోంది.


Related Post