రేవంత్‌, హరీష్ రాజీనామాల సవాళ్ళకు కట్టుబడి ఉంటారా?

April 27, 2024


img

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ‘పంట రుణాల మాఫీ’ అంశంపై సిఎం రేవంత్‌ రెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుల మద్య రాజీనామాల సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జరుగుతుండటం ఆసక్తికరంగా ఉంది. 

ఆగస్ట్ 15లోగా పంట రుణాలు మాఫీ చేస్తానని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించి, ఓటర్లను, ముఖ్యంగా రైతులను ప్రసన్నం చేసుకోవాలనుకున్నారు. ముఖ్యమంత్రి దేవుడిపై ఓట్లు వేసి మరీ చెపుతుంటే ఓటర్లు నమ్మకుండా ఉండరు. కనుక కాంగ్రెస్‌కు ఓట్లు వేయడం ఖాయమే. 

ఇది బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా బాగానే పసిగట్టారు. కనుక రేవంత్‌ రెడ్డి అబద్దం చెపుతున్నారని నిరూపించేందుకు ‘ఈ హామీ అమలుచేయకపోతే రాజీనామా చేస్తావా?’ అని సవాలు విసిరారు. ఒకవేళ రేవంత్‌ రెడ్డి వెనక్కు తగ్గినా, హరీష్ సవాలుపై స్పందించకపోయినా బిఆర్ఎస్ వాదనలు నిజమని ప్రచారం చేసుకునే అవకాశం లభించేది. 

ఇది సిఎం రేవంత్‌ రెడ్డికి కూడా తెలుసు. కనుక ‘నేను ఖచ్చితంగా హామీ అమలు చేస్తాను. చేస్తే బిఆర్ఎస్ పార్టీని మూసేస్తావా? నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా?’ అంటూ ప్రతి సవాలు విసిరారు. 

ఇప్పుడు హరీష్ రావు వెనక్కు తగ్గితే బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలుగుతుంది కనుక రాజీనామా పత్రం పట్టుకొని గన్‌ పార్క్ వచ్చి సిఎం రేవంత్‌ రెడ్డికి మళ్ళీ ప్రతి సవాలు విసిరారు. సిఎం రేవంత్‌ రెడ్డి కూడా దానిని స్వీకరిస్తూ పంట రుణాల మాఫీ అమలుచేయకపోతే రాజీనామాకు సిద్దం అని ప్రకటించేశారు. 

దీంతో తాను ఈ హామీ అమలుకి కట్టుబడి ఉన్నాననే బలమైన సందేశం రైతులకు పంపిన్నట్లయింది. పనిలో పనిగా హరీష్ రావుని కూడా తన సవాలుకి కట్టుబడి ఉండేలా చేసేందుకు ‘స్పీకర్‌ ఫార్మాట్‌’లో రాజీనామా పత్రం సిద్దం చేసి ఉంచుకోమని సూచించారు. 

వీరిద్దరూ ఈ సవాళ్ళకు కట్టుబడి ఉంటారో లేదో తెలీదు కానీ వీటితో రాష్ట్రంలో ఓటర్లను, ముఖ్యంగా రైతులను తమవైపు తిప్పుకునేందుకే గట్టిగానే ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు.


Related Post