రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీకి కుట్ర: రేవంత్‌

April 25, 2024


img

పిసిసి అధ్యక్షుడు, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బీజేపీపై సంచలన ఆరోపణ చేశారు. “ఈ లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 405 సీట్లు గెలుచుకొంటామని ఎందుకు చెపుతోందంటే, పార్లమెంటులో రిజర్వేషన్లు రద్దుకి బిల్లు పెట్టి ఆమోదింపజేసుకోవడానికే. ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలు రిజర్వేషన్లు రద్దు చేయాలని చాలా కాలంగా వాదిస్తూనే ఉన్నారు.

ఈసారి బీజేపీ గెలిచి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మోడీ ప్రభుత్వం తప్పకుండా రిజర్వేషన్లు రద్దు చేస్తుంది. కనుక రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు ఈవిషయం గుర్తుంచుకోవాలి. బీజేపీకి పడే ప్రతీ ఓటు, అది గెలుచుకునే ప్రతీ ఎంపీ సీటు రిజర్వేషన్ల రద్దుకే దోహదపడుతుందని అందరూ గుర్తుంచుకోవాలి. 

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేసి జనాభా ప్రాతిపదికన వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలనుకుంటుంటే, బీజేపీ అసలు రిజర్వేషన్లే ఉండకూడదని అనుకుంటోంది. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న కొందరు (మందకృష్ణ మాదిగ) తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్లు రద్దు చేయాలనుకొంటున్న బీజేపీకి మద్దతు ఇస్తుండటం చాలా బాధాకరం,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 


Related Post