అమృతధారలు

April 23, 2017
img

వృధాగా మురికి కాలువలలో కలిసిపోతున్న వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకే విధంగా చేయగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి కనుక త్రాగునీటి సమస్య ఉండదని ఈ రంగంలో చిరకాలంగా కృషి చేస్తున్న సుబాష్ చంద్ర రెడ్డి చెపుతున్నారు.    

ఉదాహరణకి హైదరాబాద్ లో ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ తమ అవసరాల కొరకు రోజుకు 15 నీటి ట్యాంకర్లు తెప్పించుకొనేది. దాని కోసం చాలా డబ్బు, ఏర్పాట్లు, సకాలంలో సరిపడినన్ని నీళ్ళ ట్యాంకర్లు రాకపోతే సమస్యలు, వాటి వలన ఆందోళన వగైరా తప్పవు. సుబాష్ చంద్ర రెడ్డి ఈ సమస్యలన్నిటికీ ‘ఇన్వర్స్ రెయిన్ హార్వెస్టింగ్’ విధానం ద్వారా శాశ్విత పరిష్కారం చూపారు. ఈ పద్దతిలో కేవలం 4 బోర్లు ఆ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఆ నాలుగు బోర్లలో పుష్కలంగా నీళ్ళు వస్తుండటంతో నాటి నుంచి నేటి వరకు కూడా ఆ సంస్థ మళ్ళీ ఎన్నడూ నీళ్ళ ట్యాంకర్లు తెప్పించుకోలేదు. ఆ సంస్థలో ఉన్న అనేక భవనాలపై పడే వర్షపు నీరు ఇదివరకు పైపుల ద్వారా కాలువలలో కలిసిపోతుండేది. వాటిని సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిల్టరేషన్ ట్యాంక్స్ తో అనుసంధానం చేసి అక్కడి నుంచి ఆ నీటిని ఇన్వర్స్ రెయిన్ హార్వెస్టింగ్ పద్దతిలో ఏర్పాటు చేసిన బోర్ వెల్స్ తో కలపడంతో భూమిలో భూగర్భజలాలు పెరిగి నాలుగు బోర్లు పుష్కలంగా నీళ్ళు అందించడం మొదలుపెట్టాయి. 

ఈ సంగతి తెలుసుకొని గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్, నిజాం పేటలో పలుసంస్థలు, భవన నిర్మాణసంస్థలు కూడా ఆయన సహకారంతో ఇన్వర్స్ రెయిన్ హార్వెస్టింగ్ పద్దతిలో బోర్ వెల్స్ ఏర్పాటు చేసుకొని నీటి సమస్య నుంచి శాశ్వితంగా బయటపడటమే కాక నీళ్ళ ట్యాంకర్ల కోసం చేస్తున్న ఖర్చును కూడా మిగిల్చుకొన్నాయి. అలాగే ఆయన నగరంలో , రాష్ట్రంలో పలు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఈవిధంగా బోర్ వేల్స్ ఏర్పటు చేసి నీటి సమస్యను పరిష్కరించి చూపారు.

హైదరాబాద్ వంటి మహానగరంలో సగటున కురిసే వర్షపాతంతో కూడా అద్భుతాలు చేయవచ్చని సుబాష్ చంద్ర రెడ్డి నిరూపించారు. ఒక 100 చ.మీటర్ల విస్తీర్ణంలో ఏకంగా 60,000 లీటర్ల నీటిని ఒడిసిపట్టుకోవచ్చని చెపుతున్నారు. ఆ లెక్కన కొన్ని వందలు లేదా వేల చ.మీటర్ల విస్తీర్ణం కలిగిన హైదరాబాద్ నగరంలోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు, ఆసుపత్రులు, పరిశ్రమలలో ఎన్ని లక్షల లీటర్లను నిలువచేయవచ్చో లెక్క కట్టలేము. కనుక ప్రతీ ఒక్కరు ఈ విధానంలో వర్షపు నీటిని పొదుపు చేయడం చాలా అవసరం. 

నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు..ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలనుకొనేవారు.. సుబాష్ చంద్రరెడ్డి గారి సలహాలు, సేవలు పొందగోరేవారు.. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్, ఈ మెయిల్ :

ఫోన్: 9440055253,

e-mail: saverainwater@gmail.com

web site: http://smaran.org/   

Related Post