అమృతధారలు-2

April 24, 2017


img

“మనం ఏదైనా పని చేస్తే దాని ప్రతిఫలం డబ్బు రూపంలో మన కంటికి కనబడుతుంది కనుక ఆ పని యొక్క విలువ, లెక్కలు మనకి అర్ధం అవుతాయి. కానీ వర్షపు నీటిని భూగర్భంలోకి పంపించి పొదుపు చేస్తే దాని ఫలితం వెంటనే కంటికి ప్రత్యక్షంగా కనబడదు కనుకనే చాల మంది వర్షపునీటిని పొదుపు చేసుకోవడానికి ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలనుకోరు. కానీ నీటి కొరత కారణంగా నీళ్ళ ట్యాంకర్లపై వారు చేసే ఖర్చు, వాటి ఏర్పాటు కోసం వెచ్చిస్తున్న సమయం వంటివి లెక్కగట్టుకొంటే, వర్షపు నీటి విలువ ఎంతో అర్ధం చేసుకోవచ్చు,” అని సుబాష్ చంద్ర రెడ్డి చెపుతారు. 

ఆయన హైదరాబాద్ బి.ఎస్.ఎన్.ఎల్.లో పనిచేస్తున్నారు. కానీ ఒకవైపు అమృతధారల వంటి వర్షపునీరు వృధాగా కాలువలలో కలిసిపోతుంటే మరో వైపు ప్రజలు నీటికి కటకటలాడుతుండటం, వారికి నీళ్ళు సరఫరా చేయలేక ప్రభుత్వం అష్టకష్టాలు పడుతుండటం చూసి, స్మరణ్ అనే సంస్థను స్థాపించి ఈ మహాయజ్ఞం ప్రారంభించారు.

ఆయన కృషిని గుర్తించిన తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సుబాష్ చంద్ర రెడ్డి పేరును సి.ఎం.ఎస్.వాతావరణ్ సంస్థకు ప్రతిపాదించగా ఆ సంస్థ దక్షిణాది రీజియనల్ డైరెక్టర్ చేతుల మీదుగా “హైదరాబాద్ గ్రీన్ అంబాసిడర్” అనే అవార్డు అందుకొన్నారు.

రాష్ట్రంలో ప్రజలకు, భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు అయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కనుక అందరూ ఇది తమ సామాజిక బాధ్యతగా భావించి ఆయనకు సహకరించినట్లయితే, నగరంలో, రాష్ట్రంలో నీటి కొరతను శాస్వితంగా తీర్చుకోవచ్చు.

“కొంతమంది ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొన్నాము కదా వర్షపు నీరు అంతా భోమిలోకి ఇంకుతోందని భావిస్తుంటారు. కానీ ఒక ఇంకుడు గుంత ఎన్ని లీటర్లు వర్షపునీటిని స్వీకరిస్తుంది..ఎంత నీటికి ఎటువంటి ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకోవాలి? ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? అని కొంచెం శాస్త్రీయంగా ఆలోచించి ఏర్పాటు చేసుకొన్నట్లయితే వారు పెట్టిన డబ్బు, శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది,” అని ఈ రంగంలో గత రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సుబాష్ చంద్ర రెడ్డి చెపుతున్నారు. 

అలాగే పట్టణాలలో, గ్రామాలలో పూర్తి భిన్నమైన పరిస్థితులు, ఇళ్ళు, నేల, వర్షపాతం ఉంటాయి కనుక వాటికి తగ్గట్టుగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సుబాష్ చంద్ర రెడ్డి చెపుతున్నారు. 

నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు..ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలనుకొనేవారు.. సుబాష్ చంద్రరెడ్డి గారి సలహాలు, సేవలు పొందగోరేవారు.. సంప్రదించవలసిన ఈ మెయిల్ : saverainwater@gmail.com, ఫోన్: 9440055253.


Related Post