అయితే అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా తప్పదా?

April 23, 2026


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల సమయంలో సిఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా మహ్మద్ అజారుద్దీన్ని మంత్రి పదవి ఇచ్చారు. కానీ మంత్రి పదవిలో కొనసాగాలంటే తప్పనిసరిగా శాసనసభ, మండలి ఏదో ఓ సభలో సభ్యుడై ఉండాలి. లేదా పదవి చేపట్టిన ఆరు నెలలలోపు ఎన్నికవ్వాలి. ఆ ఆరు నెలల గడువు ఈ నెలాఖరుతో అంటే మరో వారం రోజులలో గుస్తుంది. కానీ ఇంతవరకు తెలంగాణ గవర్నర్‌ శివ్‌ ప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకోలేదు. తీసుకోకపోవచ్చని సుప్రీంకోర్టు తాజా విచారణలో తేలిపోయింది. 

క్లుప్తంగా ఫ్లాష్ బ్యాక్:  

ప్రొఫెసర్ కోదండరామ్‌, మంత్రి అజారుద్దీన్‌లను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలు మండలికి నామినేట్ చేయాలని కోరుతూ ప్రభుత్వం సిఫార్సు చేసి చాలా కాలమే అయ్యింది. కానీ ఈ నియామకాలపై న్యాయవివాదాలు ఏర్పడటంతో మాజీ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే బదిలీపై మహారాష్ట్రకు వెళ్ళిపోయారు. 

ఈ ఏడాది మార్చిలో ఆయన స్థానంలో శివ్‌ ప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనని కలిసి వారిరువురినీ మండలికి నామినేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున నేటికీ ఆయన నిర్ణయం తీసుకోలేదు. 

ఈలోగా దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గవర్నర్‌ తరపున అటార్నీ జనరల్ ఆర్‌.వెంకట రమణి వాదిస్తూ, ఈ ఫైలుని పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం అవసరమని విజ్ఞప్తి చేశారు. 

జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్‌ బిష్ణోయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయన వాదనలతో ఏకీభవిస్తూ జూలై 22 వరకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ గవర్నర్‌-తెలంగాణ ప్రభుత్వం మద్య సయోధ్య ఉంటే ఆయన సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని లేకుంటే జూలై 22న విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. 

అంటే ఏప్రిల్‌ నెలాఖరులోగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోకపోతే అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదన్న మాట!



Related Post