ఒక యుద్ధం ముగిసింది.. మరొకటి మొదలైంది!

May 25, 2025


img

పహల్గాం దాడి తర్వాత భారత్‌-పాక్‌ మద్య అకస్మాత్తుగా ఉద్రిక్తతలు పెరిగి ప్రత్యక్ష యుద్ధానికి దారి తీయగా, మే 7న ఆపరేషన్ సింధూర్‌తో మొదలైన ఈ యుద్ధం మే 10న అంటే కేవలం మూడు రోజులలోనే ముగిసింది. అయితే నేటికీ ఇరుదేశాల మద్య కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. మొన్న ఇండిగో విమానం అత్యవసరంగా పాక్‌ గగనతలంలో ప్రవేశించేందుకు అనుమతి కోరితే పాక్‌ అనుమతి నిరాకరించడం ఇందుకు ఓ చిన్న ఉదాహరణ. 

కేంద్ర ప్రభుత్వం వివిద పార్టీల ఎంపీలతో నాలుగు దౌత్య బృందాలను ఏర్పాటు చేసి వివిద దేశాలకు పంపించి, పాక్‌ ఉగ్రవాదులను పంపించి భారత్‌ని ఏవిదంగా దెబ్బ తీస్తోందో వివరింపజేస్తోంది. తద్వారా భారత్‌ తన వాదనలను, ఆపరేషన్ సింధూర్‌ చేపట్టడాన్ని సమర్ధించుకుంటూ దౌత్య యుద్ధం చేస్తోందని చెప్పవచ్చు. 

భారత్‌ తరపున  కాంగ్రెస్‌ ఎంపీ శశి ధరూర్ నేతృత్వంలో ఓ బృందం అమెరికా చేరుకొని, అపాయింట్‌మెంట్‌ లభిస్తే ప్రెసిడెంట్ ట్రంప్‌ని లేకుంటే అధికారం విపక్ష పార్టీల ప్రతినిధులను కలిసి మాట్లాడుతారు. మజ్లీస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ఓ బృందం బహ్రెయిన్‌ చేరుకోగా, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే నాయకత్వంలో ఓ బృందం ఖతార్ చేరుకొని అక్కడి ప్రభుత్వాధినేతలతో సమావేశమవుతోంది. 

కేంద్ర ప్రభుత్వం ఈ దౌత్య యుద్ధం బాధ్యతలను అధికార పార్టీ ఎంపీలకు కాకుండా ప్రతిపక్ష ఎంపీలకు అప్పగించడం చాలా తెలివైన నిర్ణయమే. పాక్‌ ఉగ్రవాదంపై దేశంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని తెలియజేస్తున్నట్లయింది. 


Related Post