హనుమకొండ రజతోత్సవ సభ తర్వాత బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని అందరూ భావిస్తే, అప్పటి నుంచే ఆ పార్టీలో లుకలుకలు మొదలవడం విశేషం.
ఆ సభలో కల్వకుంట్ల కవిత, హరీష్ రావులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, గాయం పేరుతో కేటీఆర్ సైలంట్ అవడం, కేసీఆర్ ప్రసంగంలో బీజేపిని, కేంద్రాన్ని విమర్శించకుండా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపారనే వాదనలు వంటివి ఆ సభని నిరర్ధకంగా మార్చాయనే వాదనలు అప్పుడే వినిపించాయి.
ఇవి సరిపోవన్నట్లు కేటీఆర్, హరీష్ రావు మద్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరడంతో హరీష్ రావు పార్టీ వీడి సొంత పార్టీ పెట్టుకోబోతున్నారనే ఊహాగానాలు వినిపించాయి.
వాటిని ఆయన స్వయంగా ఖండించినప్పటికీ కేటీఆర్‌కి పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారనే కొత్త విషయం బయటపెట్టారు.
కేటీఆర్ వరుసగా రెండు రోజులు హరీష్ రావు ఇంటికి వచ్చి భేటీ అవడం ద్వారా తమ మద్య ఎటువంటి విభేదాలు లేవని నిరూపించబోతే, సరిగ్గా ఆ భేటీలే ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
తాజాగా కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌కు వ్రాసిన లేఖ బయటకు పొక్కింది. అది నిజమైనదా లేక రాజకీయ ప్రత్యర్ధులు ఆడుతున్న మైండ్ గేమ్‌లో భాగమా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
కానీ ఆ లేఖలో కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలో తప్పులను ఎత్తి చూపుతూ సున్నితంగా విమర్శించడం, పార్టీ అంతర్గత పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
అమెరికా పర్యటనకు వెళ్ళిన కల్వకుంట్ల కవిత శుక్రవారం హైదరాబాద్ తిరిగివస్తున్నారు. కనుక ఆమె తన లేఖపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
ఏది ఏమైనప్పటికీ బిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఆధిపత్య పోరు, కుమ్ములాటలు జరుగుతున్నాయని వారు ముగ్గురే బయటపెట్టుకుంటుంటే, ఇటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అల్లుకుపోతోందని చెప్పక తప్పదు.