నేడు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్-2025 సుందరీమణులు పలు క్రీడా పోటీలలో పాల్గొన్నారు. మే 7న ఈ పోటీలకు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించినప్పుడు, బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యుద్ద సమయంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నందుకు సిఎం రేవంత్ రెడ్డిని ఎంతగా విమర్శించారో అందరూ విన్నారు.
కానీ ఇప్పుడు బిఆర్ఎస్ సోషల్ మీడియా, కేటీఆర్ కూడా సైలంట్ అయిపోయారు. ఎందువల్ల అంటే, మే 7 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు భారత్-పాక్ మద్య యుద్ధవాతావరణం నెలకొని ఉన్నప్పటికీ, పోటీలు ప్రారంభం అయ్యే సమయానికి అంటే మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకి అంగీకరించడంతో మిస్ వరల్డ్ పోటీలకు అవరోధాలు తొలగిపోయాయి. ఇప్పుడు విమర్శిస్తే ప్రజలు కూడా నవ్వుతారు కనుక.
మే 7 నుంచి నేటి వరకు, మళ్ళీ రేపటి నుంచి అసలు పోటీలు మొదలయ్యే రోజు (మే 22) వరకు 110 దేశాల సుందరీమణులకు హైదరాబాద్‌లోని చార్మినార్, లాడ్ బజార్, చౌ మహల్లా ప్యాలస్‌తో సహా తెలంగాణ ప్రముఖ పర్యాటక కేంద్రాలకు, రామప్ప, వేయి స్థంభాల గుడి, యాదగిరిగుట్ట వంటి ప్రసిద్ద ఆలయాలకు, మన పోచంపల్లి చేనేత కళాకారుల వద్దకు తీసుకువెళ్ళి చూపించి వారి విశిష్టత గురించి వివరిస్తున్నారు.
110 దేశాల సుందరీమణులు ఆయా ప్రాంతాలలో ఫోటోలు, వీడియోలు తీసుకొని తమ సోషల్ మీడియా ఖాతాలలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తు, ఆ విశేషాలను తమ దేశ ప్రజలతో పంచుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది వాటిని చూసి తెలంగాణ, హైదరాబాద్ గొప్పదనం గురించి తెలుసుకొని ప్రశంశలు కురిపిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చాలా తెలివిగా ఈ కార్యమాలను చక్కగా ప్లాన్ చేసుకొని ఈ పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన 110 దేశాల సుందరీమణుల ద్వారా తెలంగాణ, హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసింది. తద్వారా రాబోయే రోజుల్లో విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వాన్ని, సిఎం రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్లు విమర్శించిన బిఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ఇప్పుడేమంటారో?