సరస్వతి పుష్కరాలకు వెళుతున్నారా? అయితే ఇది మీ కోసమే!

May 17, 2025


img

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులలో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తోంది. ఈ నెల 14 నుంచి సరస్వతి నది పుష్కరాలు మొదలయ్యాయి. ఈ నెల 26తో ముగుస్తాయి. 

తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‌తో సహా రాష్ట్రం నలుమూలల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. కనుక సరస్వతి పుష్కరాలకు తెలంగాణతో సహా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 

కానీ కాళేశ్వరం చుట్టూపక్కల చూడాల్సిన కొన్ని ప్రసిద్ద ఆలయాలు, పర్యాటక కేంద్రాలున్నాయనే విషయం తెలియక పుష్కరాలకు వచ్చినవారిలో చాలా మంది స్నానాలు చేసి ఒడ్డునే ఉన్న కాళేశ్వరస్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్ళిపోతున్నారు. కాళేశ్వరం చుట్టూపక్కల తప్పక చూడాల్సిన ఆలయాలు ఇవే..  

కోటగుళ్ళు: ఈ ఆలయ సముదాయం కాళేశ్వరం నుంచి 67 కి.మీ.దూరంలో ఉన్నాయి. కాకతీయుల కళా నైపుణ్యం, ఒకే చోట 22 ఆలయాలు ఉండటం కోటగుళ్ళు ప్రత్యేకత.  

రామప్ప ఆలయం:  కాళేశ్వరానికి 79 కిమీ దూరంలో ములుగు జిల్లాలో సుప్రసిద్ద రామప్ప ఆలయం ఉంది. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు ఇటీవలే రామప్ప ఆలయం దర్శించుకొని వెళ్ళారు. 

మేడారం:  కాళేశ్వరం నంచి 83 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలో మేడారంలో వన దేవతలు సమ్మక్క సారలమ్మ ఆలయం ఉంది. ప్రతీ రెండేళ్ళకు ఓసారి మహా జాతర, మద్య ఏడాదిలో మినీ జాతర జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలలో కోటిన్నర మందికి పైగా భక్తులు వచ్చే ఏకైక మహా జాతర ఇదే. 

యోగ నరసింహ స్వామి ఆలయం: కాళేశ్వరానికి 97 కిమీ దూరంలో జగిత్యాల జిల్లా, ధర్మపురిలో ఈ ఆలయం ఉంది. దేశంలో బ్రహ్మదేవుడు, యమధర్మరాజు  ఆలయాలు చాలా అరుదు. వాటిలో ఇది కూడా ఒకటి. ఇక్కడ యోగ నరసింహ స్వామి ఆలయంలో త్రిమూర్తులు, యమధర్మరాజు ఆలయాలు ఉన్నాయి. 

వేయి స్తంభాల గుడి: కాళేశ్వర నుంచి 120 కిలోమీటర్ల దూరంలో వరంగల్ జిల్లాలో ఈ వేయి స్తంభాల ఆలయం, వరంగల్ కోట ఉన్నాయి. కాకతీయుల కాలంలో అంటే సుమారు 1200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం, రాష్ట్ర చిహ్నంలో భాగంగా మారిన కాకతీయ కళాతోరణం గురించి అందరికీ తెలిసిందే. 



Related Post