కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఏక సభ్య కమీషన్ విచారణ ప్రక్రియ ముగిసింది. ఈ ప్రాజెక్టుకి కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన మాజీ సిఎం కేసీఆర్‌ని, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి హరీష్ రావులను ప్రశ్నించకుండానే విచారణ ప్రక్రియ ముగించడం ఆశ్చర్యకరమే.
అయితే వారిరువురినీ విచారణకు పిలిచినా రాకుండా పెద్ద పెద్ద లేఖలు వ్రాయడమే కాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారని ఇదివరకే స్పష్టమైంది కనుక వారితో సమయం వృధా చేసుకోవడం కంటే విజిలెన్స్ విభాగం నివేదిక, ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నవారందరూ ఇచ్చిన వివరాలు, సాక్ష్యాధారాల ఆధారంగా నివేదిక తయారుచేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం మంచిదని జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ భావించి ఉండవచ్చు. కనుక ఈ నెలాఖరులోగా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది.
ముందుగా ఆ నివేదికని శాసనసభ సమావేశాలలో పెట్టి, బిఆర్ఎస్ పార్టీని ఎండగట్టిన తర్వాతనే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కానీ ఎఫ్-1 రేసింగ్ కేసులోనే మాజీ మంత్రి కేటీఆర్‌ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని సిఎం రేవంత్ రెడ్డి చెపుతున్నప్పుడు కాళేశ్వరం కేసులో కేసీఆర్‌పై చర్యలు తీసుకునేందుకు కేంద్రం అంగీకరిస్తుందా?అనే సందేహం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ నివేదిక ప్రభుత్వం చేతికి వస్తే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య మళ్ళీ రాజకీయ యుద్ధాలు మొదలవుతాయి.