భారత్-పాక్ దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ ఈ నెల 10న ఫోన్ ద్వారా మాట్లాడుకొని కాల్పుల విరమణ చేసి పూర్వస్థితిని కొనసాగించాలని నిర్ణయించారు.
కానీ ఇకపై భారత్‌పై జరిగే ఉగ్రదాడిని ‘యుద్ధ చర్య’గానే భావించి ప్రతిస్పందిస్తామని ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఇద్దరు చెప్పినందున, ఈ కాల్పుల విరమణ ఎంత కాలం కొనసాగుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.
నేటికీ జమ్ము కశ్మీర్‌లో అనేక మంది ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారు. అదును చూసి వారు మళ్ళీ దాడులు చేయకుండా ఉండరు. కనుక భద్రతా దళాలు వారిని ఏరి పారేస్తున్నాయి. కానీ అంత మాత్రాన్న జమ్ము కశ్మీర్‌లోకి పాక్ నుంచి ఉగ్రవాదులు జొరబడకుండా ఉంటారని అనుకోలేము.
పైగా భారత్‌తో ప్రత్యక్ష యుద్ధం కోరుకుంటున్నవారు పాక్ సైన్యం, ఐఎస్‌ఐలో చాలా మందే ఉన్నారు. కనుక అందుకోసం వారు ఉగ్రవాదుల చేత భారత్‌పై దాడి చేయించి మళ్ళీ యుద్ధం జరిగేలా చేసే అవకాశం ఉంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని భారత్‌కు అప్పగించాలని ప్రధాని మోడీ, రాజ్‌నాధ్ సింగ్ చెప్పినప్పటికీ, ఈ అంశంపై భారత్-పాక్ మద్య ఎటువంటి చర్చలు జరుగలేదు. బహుశః అందువల్లే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదనే మాట వినిపిస్తోంది. కనుక ఈ కాల్పుల విరమణ ఎన్ని రోజులు కొనసాగించగలరో అనుమానమే.