మీరు పైసలిస్తే వచ్చిన్నారా బాయ్?కడుపు కాలితే కదా వచ్చిన్రు?

February 15, 2023


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి “హాత్ సే హాత్ జోడో” పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. మొదట ఆయన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా నిన్న భద్రాచలంలో నేడు పాలకుర్తిలో పాదయాత్ర సభలలో పాల్గొంటున్నారు. 

ఈరోజు పాలకుర్తి సభలో వి.హనుమంతరావు ప్రసంగిస్తూ, “ఇవాళ్ళ మా నాయకుడు ఒకడు (కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి) గలత్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఖుల్లా జెప్తా... ఏ అయ్యకి భయపడేది లేదు. మేమందరం కలిసి లేమా? ఇదిగో వీడు రేవంత్‌ రెడ్డి... వీడు భట్టి... మేమందరం కలిసి ఉంటే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని అనుకోవద్దట! తెలంగాణల హంగ్ అసెంబ్లీ వస్తుందట! ఏం జ్యోతిష్యం చెపుతున్నావురా బాబు?కింది కార్యకర్త 8 ఏళ్ల నుంచి సఫర్ అవుతున్నాడు. అన్నమో రామచంద్రా అంటున్నాడు... ఉద్యోగాలు లేవు.. నీ సమయం ఆసన్నమైందిరా కేసీఆర్‌ దొర అంటున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ వలన కార్యకర్తల బలం తగ్గిపోతుంది. అదే... ఏయ్ మేమున్నామురా... అంటే పదిమంది కార్యకర్తలు వస్తారు. నువ్వేదో గొప్ప అనుభవశాలివట!రాహుల్ గాంధీ ఏమన్నాడు... నో క్వశ్చన్ ఆఫ్ ప్రాబ్లెమ్ విత్ ఎనీ పోలిటికల్ పార్టీ అని అన్నాడు. మనకి దమ్ముందిరా బాబు. ఈ జనాలని చూస్తే ఏమర్దమవుతోంది? మీరు పైసలిస్తే వచ్చిన్నారా బాయ్? ఎవరికీ ఆరే వచ్చిన్నారు కదా? ఎందుకు వచ్చిన్రు?మీ కడుపులో మంట ఉన్నది.అందుకే వచ్చిన్రు,” అని అన్నారు. 

వి.హనుమంతరావు ప్రసంగిస్తుంటే ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఈలలు వేస్తూ హర్షధ్వానాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియర్ నాయకుడు, ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌-బిఆర్ఎస్‌ పొత్తు అనివార్యమంటూ చేసిన వ్యాఖ్యలని, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా తప్పు పట్టి ధైర్యంగా విమర్శించలేకపోయారు. కానీ హనుమంతరావు బహిరంగంగా తప్పు పట్టారు. అలా మాట్లాడితే పార్టీకి నష్టం కలుగుతుందని బహిరంగంగానే చెప్పారు. అంతేకాదు... పార్టీలో నాయకులందరం కలిసే ఉన్నామని ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి తెలియజెప్పారు. తద్వారా పార్టీకి సీనియర్ నేతలు ఎంత అవసరమో హనుమంతరావు నిరూపించి చూపారు. అయితే దశాదిశ లేకుండా సాగుతున్న కాంగ్రెస్ పార్టీని పూర్తిగా గాడినపెట్టుకోవడం చాలా అవసరం. లేకుంటే ఎవరు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదు.  


Related Post