చిన జీయర్‌స్వామికి అంటుకొన్న క్యాసినో మరకలు ఏ సబ్బుతో కడిగిన పోయేలాలేవని ఓ పక్క ఆయన శిష్యులు బాధపడుతుంటే, క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ఆ మరకను మరింత పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
తనపై ఈడీ కేసుల గురించి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను చట్ట ప్రకారమే క్యాసినోలు నిర్వహిస్తున్నాను తప్ప రహస్యంగా, అక్రమంగా ఏమీ చేయడం లేదు. అదే విషయం ఈడీ అధికారులకు చెపుతున్నాను. ప్రముఖుల కోసం క్యాసినోలు నిర్వహించడం వరకే నా బాధ్యత. దానిలో పాల్గొనేవారి లావాదేవీలతో నాకు సంబందం లేదు. హవాలా వ్యవహారాలతో నాకు అసలు సంబందం లేదు.
నన్ను ఈడీ విచారణకు పిలిచినప్పటి నుంచి క్యాసినోలో పాల్గొనే రాజకీయ నాయకుల పేర్లు ఈడీకి చెప్పాలంటూ నాకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. లేకుంటే నన్ను హత్య చేయించడానికి హిట్‌మెన్ అనే విదేశీ యాప్‌లో సుపారీ ఇచ్చామని బెదిరిస్తున్నారు. అయితే వీటితో టిడిపి నేతలకి సంబందం ఉందని నేను భావించడం లేదు. నాకు భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాను.
నేను అన్ని అనుమతులు తీసుకొనే నా ఫాంహౌసులో జంతువులను పెంచుకొంటున్నాను. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో పలువురు రాజకీయనాయకులు, ప్రముఖులతో నాకు పరిచయాలు ఉన్నాయి. త్రిదండి చిన జీయర్ స్వామిని గురువుగా భావిస్తాను. అందుకే వీలైనప్పుడు ఆయన కలిసి ఆశీర్వాదం తీసుకొంటాను,” అని ప్రవీణ్ చికోటీ చెప్పాడు.