విద్యుత్‌ సంక్షోభం లేనప్పుడు దాని ప్రస్తావన ఎందుకో?

April 30, 2022


img

నిన్న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇఫ్తార్ విందులో సిఎం కేసీఆర్‌ చాలా రాష్ట్రాలు విద్యుత్‌ సంక్షోభంలో చిక్కుకోగా, మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు. ఈ విద్యుత్‌ సంక్షోభానికి కేంద్రప్రభుత్వం అసమర్దతే కారణమని విమర్శించారు.  

“తెలంగాణలో ఇదివరకు విద్యుత్‌ సరఫరా ఉంటే అది వార్త. ఇప్పుడు విద్యుత్‌ పోతే వార్త! రాష్ట్రంలో కనురెప్పపాటు కూడా విద్యుత్‌ పోదు. సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలీడేస్ పేరిట విద్యుత్‌ కోతలు విధించబడేది. కానీ మేము అధికారంలోకి వచ్చిన తరువాత 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాము. రాష్ట్రంలో రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో అత్యధిక విద్యుత్‌ వాడకం కలిగిన రాష్ట్రం తెలంగాణ. విద్యుత్‌ సమస్యను శాస్వితంగా పరిష్కరించేశాము,” అని సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు సగర్వంగా చెప్పుకొనేవారు.  

కానీ వేసవి ఎండల కారణంగా విద్యుత్‌ డిమాండ్ పెరిగి విద్యుత్‌ కొరత ఏర్పడుతుండటంతో రాష్ట్రంలో వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌ సరఫరాను కొన్ని గంటలు తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే డిమాండ్‌కి తగినంత విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా చేయలేకపోతున్నప్పుడు, మే నెలలో చేయగలదనుకోలేము. అప్పుడు కోతలు అనివార్యం కావచ్చు. 

ఒకవేళ రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్‌ కోతలు విధిస్తే, అప్పుడు ప్రజలు, ముఖ్యంగా మీడియా, ప్రతిపక్షాలు తప్పకుండా గతంలో సిఎం కేసీఆర్‌, మంత్రులు, టిఆర్ఎస్‌ నేతలు అన్న ఈ మాటలను గుర్తుచేసి విమర్శించడం తధ్యం.

బహుశః ఈవిషయం ముందే గ్రహించి సిఎం కేసీఆర్‌తో సహా టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు దేశంలో విద్యుత్‌ సంక్షోభం గురించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలను కోతలు ఎదుర్కోవడానికి మానసికంగా సిద్దం చేస్తున్నారేమో? ఎందుకంటే, దేశంలో ఇతర రాష్ట్రాలలో విద్యుత్‌ సంక్షోభం ఉన్నా తెలంగాణలో ఉండదని భావిస్తున్నప్పుడు, టిఆర్ఎస్‌ నేతలు నిత్యం దాని గురించే మాట్లాడుతున్నారు కనుక.  

గతంలో విద్యుత్‌ నిరంతర సరఫరా మేమే చేశాము అంటూ ఆ క్రెడిట్ సొంతం చేసుకొన్న టిఆర్ఎస్‌, ఒకవేళ ఇప్పుడు విద్యుత్‌ కోతలు విధించవలసివస్తే, ఈ పాపం మాది కాదు కేంద్రప్రభుత్వానిదే అని వాదిస్తూ ప్రజాగ్రహాన్ని బిజెపిపైకి మరల్చి ఆ పార్టీ నేతలను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకే టిఆర్ఎస్‌ నేతలు ఈ విద్యుత్‌ సంక్షోభం పల్లవి అందుకొన్నారేమో? 


Related Post