కేసీఆర్‌ మళ్ళీ వెనక్కు తగ్గక తప్పదా?

March 10, 2022


img

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా చెప్పుకోబడుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో బిజెపి యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. గోవాలో కాంగ్రెస్‌, బిజెపిలు పోటాపోటీ సాగుతున్నాయి. కనుక ఈ ఎన్నికలలో బిజెపి ఓడిపోతుందనే సిఎం కేసీఆర్‌ అంచనాలు మళ్ళీ తప్పబోతున్నాయి. 

ముఖ్యంగా యూపీలో బిజెపి ఘోరంగా ఓడిపోతుందని అదే బిజెపి పతనానికి ప్రారంభం అవుతుందని సిఎం కేసీఆర్‌ భావించారు. ఒకవేళ ఆ అంచనాలు నిజమైతే సిఎం కేసీఆర్‌ ప్రాంతీయ పార్టీలను కూడగట్టి బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడం సులువై ఉండేది కానీ ఆయన అంచనాలకు పూర్తి భిన్నంగా యూపీలో భారీ మెజార్టీతో బిజెపి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. 

యూపీలో అధికారంలో ఉన్న పార్టీకే జాతీయ రాజకీయాలలో పట్టు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క యూపీలోనే 403 అసెంబ్లీ సీట్లు, 80 లోక్‌సభ సీట్లు, 31 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. కనుక యూపీలో అధికారంలో ఉన్న పార్టీ చేతిలో అత్యధిక లోక్‌సభ, రాజ్యసభ సీట్లు కూడా ఉండే అవకాశం ఎక్కువ. 

ఒక్క యూపీలోనే బిజెపి సొంతంగా 60-70 లోక్‌సభ సీట్లు గెలుచుకొన్నా, బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో, మిగిలిన అన్ని రాష్ట్రాలలో కలిపి కనీసం మరో 120-160 సీట్లు అవలీలగా గెలుచుకోగలదు. ఇవి కాక అవసరమైతే బిజెపికి బయట నుంచి మద్దతు ఇచ్చే అన్నాడీఎంకె పార్టీ, వైసీపీ వంటి పార్టీలు కూడా ఉన్నాయి.  

సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీని కలుపుకోకుండా బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎంతగా బలహీనపడినా కనీసం 50-60 లోక్‌సభ సీట్లు గెలుచుకోగలదు. కనుక కాంగ్రెస్, బిజెపిలే సుమారు 350కి పైగా సీట్లు గెలుచుకోగలిగితే, కాంగ్రెస్‌ను కలుపుకోకుండా సిఎం కేసీఆర్‌ చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. 

ముఖ్యంగా ఇప్పుడు యూపీలో బిజెపి భారీ మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి రావడం చూసిన తరువాత వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీని ఢీ కొనేందుకు కాంగ్రెస్‌ లేకుండా దాని మిత్రపక్షాలు సిఎం కేసీఆర్‌ చేతులు కలుపుతాయనే నమ్మకం లేదు. కనుక యూపీ ఎన్నికల ఫలితాలు సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల విషయంలో సిఎం కేసీఆర్‌ అంచనాలు తప్పడంతో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే ఆలోచన విరమించుకొన్న సంగతి తెలిసిందే. మళ్ళీ అదే జరుగుతుందేమో?


Related Post