గణతంత్ర దినోత్సవంలో కూడా రాజకీయాలేల?

January 22, 2022


img

ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగే పెరేడ్‌లో వివిద రాష్ట్రాల శకటాలు పాల్గొనడం ఆనవాయితీ. ఇవి దేశ సమగ్రతకు, సమైఖ్యతకు, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి. అయితే ఈసారి పెరేడ్‌లో కేవలం  ఆరు రాష్ట్రాల శకటాలను మాత్రమే కేంద్రప్రభుత్వం అనుమతించడంపై మిగిలిన రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేశసమైక్యతను చాటే ఈ కార్యక్రమాన్ని కూడా మోడీ ప్రభుత్వం రాజకీయంగానే చూస్తోందని, రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని వాదిస్తున్నాయి. అయితే శకటాల ఎంపికలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోదని, దాని నిర్వహణ కమిటీయే నిర్ణయిస్తుందని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ సమర్దించుకొన్నారు. 

ఈసారి దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం, గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రవాదులు దాడులు చేయవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలు తదితర కారణాలతో శకటాల సంఖ్య తగ్గించి ఉండవచ్చు. అయితే కరోనా కట్టడి, జీఎస్టీ వంటి అంశాలపై కేంద్రప్రభుత్వం నేరుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నప్పుడు, శకటాల గురించి నేరుగా మాట్లాడి పరిస్థితి వివరించి ఉండవచ్చు. కానీ ఆలాచేయకుండా ఏకపక్షంగా రాష్ట్రాల శకటాలను పక్కన పెట్టడంతో సహజంగానే రాష్ట్రాలకు తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. దీంతో అపోహలు, అనుమానాలు ఏర్పడ్డాయి. కనుక కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాలు కూడా మొదలయ్యాయి.     

దేశంలో బిజెపియేతర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం శకటాల అంశాన్ని కూడా రాజకీయ కోణంలో నుంచే చూస్తుండటం నిజమైతే ఇది చాలా చింతించవలసిన విషయమే. దేశ సమగ్రతకు, సమైఖ్యతకు, భిన్నత్వంలో ఏకత్వాన్ని లోకానికి చాటి చెప్పవలసిన తరుణంలో రాజకీయ కారణాలతో ఈవిదంగా చేయడం ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తుంది. కేంద్రం పట్ల రాష్ట్రాలకు అపనమ్మకం ఏర్పడుతుంది. 

ఇప్పటికే దేశాన్ని, రాష్ట్రాలను ఏలుతున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రజల మద్య కులమతాలు, భాషాప్రాంతాల పేరిట చీలికలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య కూడా దూరం పెరిగితే అది దేశానికి ఏమాత్రం మంచిది కాదు. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, వాటిని నడుపుతున్న రాజకీయపార్టీలు  సున్నితమైన ఇటువంటి అంశాలపై రాజకీయాలు చేయడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. ప్రజలు కూడా హర్షించరని గ్రహిస్తే మంచిది. 



Related Post