బిజెపి తెలంగాణనే ఎందుకు ఎంచుకొంది?

December 11, 2021


img

కేంద్రహోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా వంటి బిజెపి పెద్దలు తమ తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అని చాలా స్పష్టంగా పదేపదే చెప్పడం అందరూ విన్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క తెలంగాణలో మాత్రమే టిఆర్ఎస్‌ పార్టీ చాలా బలంగా అధికారంలో నిలద్రొక్కుకొని ఉంది. అయినా బిజెపి తెలంగాణ రాష్ట్రంపైనే ఎందుకు దృష్టి పెట్టింది?అని ఆలోచిస్తే అనేక బలమైన కారణాలు కనిపిస్తాయి. 

• మతం: హిందూ-ముస్లింలు: బిజెపి మతతత్వ పార్టీ కనుక మతం ఆధారంగా రాజకీయాలు చేస్తుందని అందరికీ తెలుసు. హిందూమతం గురించి గట్టిగా మాట్లాడాలంటే అవతలివైపు ముస్లింలు తప్పనిసరి. ఆవిదంగానే గ్రేటర్ ఎన్నికల సత్ఫలితలు రాబట్టడమే ఇందుకు తాజా ఉదాహరణ. 

• రాజకీయ శూన్యత: నిజానికి తెలంగాణలో టిఆర్ఎస్‌ చాలా బలంగా ఉంది కనుక రాజకీయ శూన్యత ఉందని చెప్పలేము. కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ఎదురే ఉండకూడదనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీసి బలహీనపరచడంతో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయింది. ఇటువంటి అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న బిజెపి, టిఆర్ఎస్‌ చేజెతులా అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని  ఖాళీ అయిన కాంగ్రెస్‌ స్థానంలోకి ప్రవేశించి క్రమంగా బలపడింది. ఇది టిఆర్ఎస్‌ స్వయంకృతాపరాధమే అని చెప్పవచ్చు. ఎందుకంటే, అప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా మరింత బలహీనపరిచి కేంద్రంలోఅధికారంలో ఉన్న బిజెపిని తెచ్చిపెట్టుకొంది కనుక! కాంగ్రెస్ పార్టీ కూడా ముంచుకు వస్తున్న ఈ సమస్యను గుర్తించడంలో చాలా ఆలస్యం చేయడం బిజెపి బలపడేందుకు అవకాశం కలిగింది.  

• భాష-అవరోధం: దక్షిణాదిన మిగిలిన మూడు రాష్ట్రాలలో కూడా ముస్లిం జనాభా ఉన్నప్పటికీ బిజెపి ఎదుగుదలకి అక్కడ భాష ప్రధాన అవరోధంగా ఉంది. తమిళనాడులో బిజెపికి మతతత్వ పార్టీ ముద్రకంటే ఉత్తరాది పార్టీ లేదా హిందీ అనుకూల పార్టీ అనే ముద్రే బలంగా ఉంది. కేరళలో కూడా బిజెపికి ఇదే సమస్య ఎదురవుతోంది. కానీ తెలంగాణలో దాదాపు ప్రజలందరూ హిందీ లేదా హిందీ కలగలిసిన ఉర్దూ మాట్లాడుతారు. చక్కగా అర్ధం చేసుకోగలరు కూడా. కనుక బిజెపి జాతీయ పార్టీ అయినప్పటికీ రాష్ట్ర నేతల కృషి వలన బిజెపిని తెలంగాణకు చెందినదిగానే భావిస్తుంటారు. ఇది బిజెపికి కలిసి వస్తున్న అంశం.  

• హామీలు-ఒత్తిళ్ళు-ఏకపక్ష నిర్ణయాలు: సిఎం కేసీఆర్‌ ప్రజలు కోరుకొంటున్నట్లుగా రాష్ట్రాన్ని అన్ని విదాల అభివృద్ధి చేస్తున్నారు. పలు సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారు కూడా. కానీ ఏదో ఓ సందర్భంలో ప్రజలు కూడా టిఆర్ఎస్‌ నుంచి ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టుల భూసేకరణలో రైతులపై ఒత్తిళ్ళు, ఎన్నికలలో టిఆర్ఎస్‌కే ఓట్లు వేయాలని ఓటర్లపై తీవ్ర ఒత్తిళ్ళు వగైరాలను చెప్పుకోవచ్చు. ఇక పంటలు..గిట్టుబాటు ధరలు, ఉద్యోగాల భర్తీ వంటి అనేక ప్రజా సమస్యలపై ఎవరూ గట్టిగా మాట్లాడే వీలులేకపోవడం, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ హామీలలో వైఫల్యం వంటివి కొన్ని కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఓ వైపు అదనపు ఆదాయం కోసం హైదరాబాద్‌లో భూములు అమ్ముకొంటూ మరో పక్క సచివాలయం కూల్చివేత, వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయ నిర్మాణం, టిఆర్ఎస్‌ రాజకీయ ప్రయోజనాల కోసం లక్షల కోట్లు ఖర్చయ్యే దళిత బంధు పధకం వంటి ఏకపక్ష నిర్ణయాలు ప్రజలలో అసంతృప్తి పెరిగేందుకు దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. వాటినే బిజెపి అస్త్రాలుగా మలుచుకొని రాష్ట్రంలో దూసుకుపోతోంది. రాష్ట్ర రాజకీయాలలో గేమ్ చేంజర్‌గా భావించిన దళిత బంధు పధకం ప్రకటించినప్పటికీ హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ ఓడిపోవడమే ఇందుకు నిదర్శనం.  

• ప్రభుత్వ వ్యతిరేకత: సుదీర్గంగా కొనసాగే ఏ ప్రభుత్వంపైనైనా సహజంగానే ప్రజలలో ఏదో ఓ విషయంలో తీవ్ర అసంతృప్తి... దాంతో వ్యతిరేకత క్రమంగా పెరుగుతుంటాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. అదే రాష్ట్రంలో బిజెపికి దారి ఏర్పరుస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పటి బిజెపికి ఇప్పటికీ బిజెపికి గల తేడాను గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది.


Related Post