ధాన్యం కొనుగోలుపై ఎవరి వాదన సరైనది?

November 27, 2021


img

ధాన్యం కొనుగోలుపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. 

కేంద్రం వాదన: ప్రస్తుతం మరో 4-5 ఏళ్ళకు సరిపడే బియ్యం నిలువలు కేంద్రం వద్ద ఉన్నాయి కనుక ఇకపై కొనుగోలు చేయలేము. బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు కనుక ఇకపై దానిని సేకరించలేము. ధాన్యం ఉత్పత్తి, గిట్టుబాటు ధరలు, కొనుగోలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి విధివిధానాలు రూపొందిస్తాము. కనుక ఇప్పటికిప్పుడు రాష్ట్రం నుంచి ఏడాదికి ఎంత ధాన్యం సేకరిస్తామనేది చెప్పలేము. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదన: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం కల్పించి, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ, రైతు బంధు పధకం అందిస్తోంది. వీటివలన రాష్ట్రంలో గణనీయంగా వ్యవసాయోత్పత్తి పెరిగింది. యావత్ దేశానికి సరిపడా బియ్యం పండించగల స్థాయికి ఎదిగింది. అయితే ఇప్పుడు కేంద్రం హటాత్తుగా రాష్ట్రంలో పండిన ధాన్యం కొనలేమని చెపుతోంది. ఇంత భారీ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఏటా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదు. చేసినా నిలువ చేసే సామర్ధ్యం లేదు. దేశ ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించే బాధ్యత కేంద్రానిదే కనుక తెలంగాణలో పండుతున్న ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఈ రెండు వాదనలు సహేతుకంగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. అయితే ఈ వాదనలతో రైతుల సమస్యలు తీరవు కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రాజకీయాలను పక్కనపెట్టి చర్చించుకొని పరిష్కారం కనుగొనాలి. దేశంలో నేటికీ కోట్లాదిమంది తిండి దొరక్క అర్ధాకలితో జీవిస్తున్నారు. అలాగే పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికా దేశాలలో కూడా తీవ్ర ఆహార కొరత ఉంది. గుప్పెడు బియ్యం దొరక్క అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కళ్ళ ముందే కనిపిస్తున్నా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అవసరానికి మించి పండిన ధాన్యం ఏమి చేసుకోవాలని తలలు పట్టుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. 



Related Post