అమెరికా, పాకిస్థాన్‌ మన వడ్లు కొంటాయా? భట్టి

November 13, 2021


img

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్‌, బిజెపిలు పోటాపోటీగా ధర్నాలు చేయడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ధాన్యం కొనుగోలు చేయవలసిన బాధ్యత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ వాటిని నడిపిస్తున్న బిజెపి, టిఆర్ఎస్‌లు ధాన్యం మీరు కోనాలంటే కాదు...మీరే కొనాలంటూ ధర్నాలు, ర్యాలీలు చేయడం సిగ్గుచేటు. రెండు పార్టీలు తమకు పాలన చేతకాదని, రైతుల ప్రయోజనాలు పట్టవని ధర్నాలతో నిరూపిస్తున్నాయి. ఓ పక్క రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందుతుంటే రెండు పార్టీలు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకపోతే అమెరికా వచ్చి కొంటుందా...లేదా పాకిస్థాన్‌ వచ్చి కొంటుందా?వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈవిదంగా డ్రామాలు ఆడుతున్నాయి. ఈ డ్రామాలతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి.  ఇకనైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకొని తక్షణం ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభించాలి,” అని అన్నారు. 

దేశంలో...రాష్ట్రంలో ఇవాళ్ళ తొలిసారిగా ధాన్యం పండించడం ప్రారంభించలేదు. దశాబ్ధాలుగా వరి పండిస్తున్నారు. దానిని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్నాయి. కానీ ఇప్పుడే ఈ సమస్య ఎందుకు వచ్చింది? అంటే కేంద్రం వద్ద భారీగా బియ్యం నిలువలు పేరుకుపోయినందున, తెలంగాణ రైతులు పండించే దుడ్డుబియ్యానికి పెద్దగా డిమాండ్ లేకపోవడం వలన ధాన్యం కొనలేమని కేంద్రప్రభుత్వం చెపుతోంది. ఇది హేతుబద్దమైన కారణమే. మరి అటువంటప్పుడు ఏమి చేయాలి?అని కేంద్రం ఆలోచించాలి కదా?గోదాములలో బియ్యాన్ని ముక్కబెట్టుకోవడం కంటే దానిని దేశంలో అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేదలకు నామమాత్రపు ధరకు అందజేయవచ్చు లేదా ఆహారం కోసం అలమటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేసి దేశంలో రైతుల దగ్గర నుంచి కొత్త ధాన్యం కొనుగోలు చేయవచ్చు కదా? ఒకవేళ ఈ రెండూ ఆచరణ సాధ్యం కాదనుకుంటే ముఖ్యమంత్రులు, నిపుణుల సూచనలు, సలహాలు అడిగి తెలుసుకొని సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఈవిదంగా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న అధికారపార్టీలే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం ఏమిటి? రాజకీయాలు చేసుకొనేందుకు ఇంకా చాలా అంశాలున్నాయి. రైతుల జీవితాలతోనే ఆడుకోవాలా?ఇందుకేనా ప్రజలు వారిని ఎన్నుకొన్నది? అని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. 


Related Post