ధాన్యం సేకరణలో ఇవీ నిజానిజాలు: సిఎం కేసీఆర్‌

November 08, 2021


img

హుజూరాబాద్‌ యుద్ధం ముగిసిన తరువాత ఇప్పుడు ధాన్యం సేకరణ, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై టిఆర్ఎస్‌, బిజెపిల మద్య యుద్ధం మొదలైంది. కేంద్రప్రభుత్వం వద్ద భారీగా బియ్యం నిలువలు పేరుకుపోవడంతో ఈసారి యాసంగిలో బియ్యం కొనుగోలుచేయలేమని రాష్ట్రాలకు చెప్పింది. కనుక రాష్ట్రంలో రైతులను ప్రత్యామ్నాయ పంటలు  వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. వాస్తవ పరిస్థితులు గమనించకుండా రైతులు వరి పండిస్తే వారే నష్టపోతారని హెచ్చరిస్తోంది కూడా. రాష్ట్రంలో రాజకీయంగా టిఆర్ఎస్‌పై పైచేయి సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న బిజెపి నేతలు రైతులను రెచ్చగొడుతున్నారు. బియ్యం కొనేందుకు కేంద్రప్రభుత్వం సిద్దంగా ఉన్నా సిఎం కేసీఆరే రైతులను వరి పంట వేయకుండా అడ్డుకొంటున్నారని చెపుతున్నారు. ఈ సమస్యను రాజకీయ ఆయుధంగా మలుచుకొని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారి విమర్శలకు సిఎం కేసీఆర్‌ ఘాటుగా సమాధానం చెప్పడమే కాక ప్రగతి భవన్‌లో నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో వాస్తవాలను వివరించారు. సిఎం కేసీఆర్‌ ఏమి చెప్పారంటే... 

• నేను ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రిని కలిసి ఈ సమస్యపై మాట్లాడాను. కేంద్రప్రభుత్వం ఎంత బియ్యం కొనుగోలు చేస్తుందో చేపితే ఆ ప్రకారమే రాష్ట్రంలో వరి లేదా ప్రత్యామ్నాయ పంటలు వేసుకొంటామని చెప్పాను. కానీ ఇంతవరకు కేంద్రం జవాబు చెప్పలేదు. 

• దీర్గ కాలంపాటు బియ్యం నిలువ చేయగల సామర్ధ్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)కి మాత్రమే ఉంది. రాష్ట్రాల వద్ద అటువంటి ఆధునిక గోదాములు, సౌకర్యాలు లేవు కనుక భారీగా ధాన్యం/బియ్యం కొనుగోలు చేయలేవు. చేసినా ఎక్కువ కాలం నిలువచేయలేవు. కొద్దిపాటి మొత్తంలో కొన్నిరోజులు మాత్రమే నిలువచేయగలవు. కనుక ఈ విషయంలో రాష్ట్రాలను తప్పు పట్టడానికి లేదు. 

• దేశంలో ఆహార కొరత ఏర్పడకుండా చూసే బాధ్యత కేంద్రంపైనే ఉంది. దాని వద్దే భారీ గోదాములు, సౌకర్యాలు ఉన్నాయి కనుక రైతులు పండించిన ధాన్యం/బియ్యం కొనుగోలు చేసే బాధ్యత దానిదే. 

• ధాన్యం/బియ్యం ఎగుమతి కూడా కేంద్రం చేతిలోనే ఉంది తప్ప రాష్ట్రాలు నేరుగా విదేశాలకు బియ్యం ఎగుమతి చేయలేవు. (ఒకవేళ ఉండి ఉంటే, రైతులు ఎంత పండిస్తే అంతా కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేయగలుగుతుంది).  

• వర్షాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కనుక అప్పుడు వచ్చిన వరి పంటలోని (ధాన్యంలో) తవుడు తక్కువగా ఉంటుంది. నాణ్యమైన బియ్యం వస్తుంది. దానినే రారైస్ అంటారు. కానీ దానిలో నూక ఎక్కువ వస్తుంది కనుక బియ్యం తగ్గుతుంది. బియ్యం తగ్గితే గిట్టుబాటు కాదు కనుక మిల్లర్లు దానిని ఆడేందుకు ఇష్టపడరు. 

• యాసంగి పంటలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించి ఉంటాయి. కనుక అప్పుడు పండించిన ధాన్యంలో తవుడు ఎక్కువగా ఉంటుంది. అందుకే రైతులు బాయిల్డ్ రైస్ (దొడ్డు బియ్యం) పండిస్తారు. అయితే కొన్ని రాష్ట్రాలలో ప్రజలు మాత్రమే ఈ దుడ్డు బియ్యం తింటారు కనుక దానికి అంత డిమాండ్ ఉండదు. అందుకే దానిని కొనబోమని కేంద్రం చెపుతోంది.

• గత ఏడాది 80 శాతం దుడ్డు బియ్యం, 20 శాతం రారైస్ తీసుకొంటామని కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. దుడ్డు బియ్యం విషయంలోనూ కేంద్రం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. అయినా వేరే గత్యంతరం లేదు కనుక అన్ని షరతులకు మేము ఒప్పుకొని ఆ ప్రకారమే రాష్ట్రంలో 50 లక్షల టన్నుల వరి పండిస్తే దానిలో 24 లక్షల టన్నులే తీసుకొని మిగిలింది తీసుకోలేదు. ఈవిదంగా చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని కేంద్రాన్ని ప్రాధేయపడితే మరో 20 లక్షల టన్నులు తీసుకొని మిగిలింది తీసుకోకుండా విడిచి పెట్టేసింది. నేటికీ దానిని తీసుకొనేందుకు ఇష్టపడటం లేదు. ఇక యాసంగి పంటను ఎందుకు తీసుకొంటుంది?ఒక్క కేజీ బియ్యం కూడా కొనబోమని ముందే చెప్పేసింది. అందుకే మేము రాష్ట్రంలో రైతులను ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని చెపుతున్నాము. 

• కానీ కేంద్రం కొంటానంటే ఎంత కావాలంటే అంతా పండించి ఇవ్వగల శక్తి మన రాష్ట్రానికి ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో 62 లక్షల ఎకరాలలో కోటి 70 లక్షల టన్నుల బియ్యం చేతికొచ్చింది. నేను ఇదే విషయం మంత్రికి ఫోన్‌ చేస్తే, మీ దగ్గర అంత పంట ఉందా? శాటిలైట్ పిక్చరులో కనబడుతాలేదని వ్యంగ్యంగా మాట్లాడారు.

• ఇదీ వాస్తవ పరిస్థితి!. కానీ రాష్ట్ర బిజెపి నేతలు ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు దీక్షలు చేస్తూ రైతులను ప్రభుత్వంపైకి రెచ్చగొడుతున్నారు. 


Related Post