తెలంగాణలో కులరాజకీయాలు ఏల?

November 02, 2021


img

రాజకీయపార్టీలు ఎన్నికల సమయంలో కుల, మతాల ఆధారంగా ఎన్నికల వ్యూహాలు రూపొందించుకోవడం సర్వ సాధారణమైన విషయమే అయినప్పటికీ హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఇది మరింత ఎక్కువగా కనిపించింది. ఈ ఉపఎన్నిక సిఎం కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో టిఆర్ఎస్‌ ప్రభుత్వం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కులాలు, మతాలవారీగా లెక్కలు తీయించి అందుకు అనుగుణంగా దళిత బంధు వంటి పధకాలను, పదవులను, వరాలను ప్రకటించింది. 

తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికలలో మొదట తెలంగాణవాదమే ఉండేది తప్ప ఈ కులాల గోల వినిపించేది కాదు. ఒకవేళ ఉన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల లెక్కలే వినిపించేవి తప్ప ఇలా ఒక్కో కులాన్ని విడదీసి చూసేవారు కాదు. కానీ టిఆర్ఎస్‌ ప్రతీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిచి తీరాలని భావించడం మొదలుపెట్టినప్పటి నుంచే ఈ ధోరణి మొదలైందని చెప్పవచ్చు. శాసనసభ ఎన్నికల సమయంలో ముస్లింలకు రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని శాసనసభలో తీర్మానించడం, హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముందు దళిత బంధు పధకం తీసుకురావడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. 

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 46వేల ఎస్సీలు, 29వేల మున్నూరు కాపులు, 26వేల పద్మశాలీలు, 24వేల గౌడ్ కులస్థులు, 23వేల ముదిరాజ్ కులస్థులు (ఓటర్లు) ఉన్నట్లు గుర్తించి వారిని ప్రసన్నం చేసుకొనేందుకు పదవులు, పధకాలు, తాయిలాలు ప్రకటించడం అందరూ చూశారు. పోనీ ఈవిదంగా చేసినా టిఆర్ఎస్‌ ఆశించినట్లు 50 వేల పైచిలుకు భారీ మెజార్టీ సాధిస్తుందా?అంటే మొదటి మూడు రౌండ్ల ఫలితాలను చూస్తే చాలా స్వల్ప శాతం ఓట్ల తేడాతో టిఆర్ఎస్‌, బిజెపిలలో ఏదో ఓ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కనుక ఎన్నికలలో లబ్ది పొందడం కొరకు ప్రజలను కులమతాలవారీగా విభజించడం సరికాదని, దీని వలన ప్రజల మద్య చీలిక ఏర్పడుతుందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Related Post